KTR: కేంద్రం తెస్తున్న కార్మిక వ్యతిరేక నూతన లేబర్ కోడ్‌లను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్(BRS)అనుబంధ కార్మిక విభాగం బీఆర్‌టీయూ(BRTU) సిద్ధంగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)శారు. ఇప్పుడు ఎన్నికలు లేనందున, రాజకీయాలకు అతీతంగా ఏ కార్మిక సంఘంతోనైనా కలిసి పనిచేస్తామని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో శనివారం కార్మిక సంఘాలతో లేబర్ కోడ్లపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, పార్లమెంటు లేదా అసెంబ్లీలో జరిగే చర్చల కంటే ఈ సమావేశంలోనే మరింత అర్థవంతమైన చర్చ జరిగిందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో సోనియా గాంధీ వ్యతిరేకించిన బిల్లును తెలంగాణ(Telangana)లా అమలు చేస్తుందని ప్రశ్నించారు. నూతన లేబర్ కోడ్‌లను తెలంగాణలో అమలు చేయవద్దని డిమాండ్ చేసిన కేటీఆర్, ఈ కోడ్‌లను అడ్డుకోవడం ద్వారా తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవడంతో పాటు, అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని ప్రకటించారు. త్వరలోనే వరంగల్‌లో తదుపరి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని కార్యాచరణను ప్రకటించారు.
వైరుధ్యాల పుట్ట ఈ దేశం
దేశం వైరుధ్యాల పుట్ట అని, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు ఉన్నారని, అదే సమయంలో అత్యంత పేదరికం కూడా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, ఐరోపా దేశాల కోసం రూపొందించిన చట్టాలను, విధానాలను గుడ్డిగా ఇక్కడ అమలు చేయడం సరికాదని, దేశంలోని భిన్నమైన సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో తెస్తున్న సంస్కరణలు స్థానిక పరిస్థితులను విస్మరిస్తున్నాయని, తెలంగాణలో 92 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉండటమే ఇక్కడి పేదరికానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేసీఆర్ ఎప్పుడూ మానవీయ కోణంలోనే ఆలోచించేవారని, సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు పదేళ్ల కాలంలో రూ.3,500 కోట్ల విలువైన బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను ఇచ్చి, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారని వివరించారు.
Also Read: Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో మరో వింత.. కోతులను పడుతున్న అభ్యర్థి.. 300 వరకూ పట్టివేత
శ్రమ దోపిడీ వల్లే ఉపద్రవం
దేశంలో పెరుగుతున్న కార్పొరేట్ ఏకాధిపత్యం ప్రమాదకరమని హెచ్చరించిన కేటీఆర్, ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభాన్ని ఉదహరించారు. ఇండిగో సంస్థలో ఏర్పడిన సమస్యల వల్ల ఐదు రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయని, విమానాశ్రయాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను తలపించాయన్నారు. ఇది ముమ్మాటికీ శ్రమ దోపిడీ వల్లే జరిగిందని, అయినా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అమలు చేయకుండా ఆ సంస్థ ఒత్తిడికి తలొగ్గిందని విమర్శించారు. కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తే, ఇలాంటి అరాచకమే అన్ని రంగాలకు విస్తరిస్తుందని హెచ్చరించారు. అంతకుముందు, బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: ‘కేసీఆర్.. మీ కొడుకే నీకు గుది బండ’.. దేవరకొండ సభలో సీఎం రేవంత్

