Sarpanch Elections: తెలంగాణలోని గ్రామాలను కోతుల సమస్య వేధిస్తోంది. పదుల సంఖ్యలో కోతులు పంట చేన్లలోకి చేరి బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు.. కోతులతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే త్వరలో సర్పంచ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ కోతులు.. అభ్యర్థులకు సైతం సవాలు విసురుతున్నాయి. దీంతో తమను గెలిపిస్తే కోతులను తరిమేస్తామని సర్పంచ్ అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు. అయితే ఓ సర్పంచ్ అభ్యర్థి మాత్రం ఇందుకు భిన్నంగా ఎన్నికలకు ముందే గ్రామంలోని కోతుల సమస్యను తీర్చేందుకు యత్నిస్తున్నారు. కోతులను పట్టుకోని బోనులో బంధిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన మొలంగురి చిరంజీవి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువ ఉన్నందున కోతులు లేకుండా చేస్తానని తనకే ఓటేయాలని కోరుతున్నాడు. ఇందుకు గాను కోతులు పట్టే వ్యక్తితో సంవత్సరం పాటు కోతులు పట్టేలా ఒప్పందం చేసుకున్నానని చిరంజీవి తెలిపారు. అంతేకాదు గ్రామస్థులకు ఇబ్బందులు సృష్టిస్తున్న పదుల సంఖ్యలో కోతులను బోనులో బంధించాడు.
Also Read: Bigg Boss 9: ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్.. సంజనాకు అన్యాయం.. ఇమ్మూను నిలదీసిన నాగ్!
కోతులు లేకుండా చేస్తా..
సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే గ్రామంలో పూర్తిస్థాయిలో కోతులు లేకుండా చేస్తానని మొలంగురి చిరంజీవి హామీ ఇస్తున్నారు. ఇప్పటికే గ్రామాన్ని పట్టి పీడిస్తున్న 300 కోతులను బోనులో బంధించినట్లు తెలిపారు. వాటిని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. కోతుల సమస్య నుంచి గ్రామానికి విముక్తి కలగాలంటే తనను గెలుపించుకోవడం అత్యంత ఆవశ్యకమని సూచిస్తున్నారు. మరోవైపు గ్రామస్థులు సైతం చిరంజీవి చేస్తున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

