Divorce Ruling: ఆత్మహత్య చేసుకుంటానంటూ భార్య పదేపదే బెదిరింపులకు పాల్పడడం, మతం మార్చుకోవాలంటూ భర్తను ఒత్తిడి చేయడం మానసికంగా క్రూరత్వమే అవుతుందని, దీని ఆధారంగా విడాకులు మంజూరు (Divorce Ruling) చేయవచ్చని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (Chhattisgarh High Court) తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలోని బలోద్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి డైవర్స్ మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 2024 జూన్ నెలలో హైకోర్టును భార్య ఆశ్రయించింది. అయితే, అన్ని వాదనలు విన్న జస్టిస్ రజనీ దూబే, జస్టిస్ అమితేంద్ర కిషోర్ ప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం కీలకమైన ఈ తీర్పును వెలువరించింది.
క్రూరత్వం అంటే శారీరక హింస ఒక్కటే కాదు
ఈ తీర్పు సందర్భంగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. క్రూరత్వం (Cruelty) అంటే కేవలం శారీరక హింసకు పరిమితం కాదని, మానసికంగా హింసించడం కూడా క్రూరత్వమే అవుతుందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ కేసులో భర్త మనస్సులో భయాన్ని కలిగించే భార్య ప్రవర్తించడం క్రూరత్వం కిందికే వస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆత్మహత్య చేసుకుంటానని భార్య పదేపదే బెదిరిస్తోందంటూ 2019 అక్టోబర్ 14న బాధిత భర్త జిల్లాలోని గురూర్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదును ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. భార్య విషం తాగడానికి ప్రయత్నించడం, కత్తితో పొడుచుకోవడానికి యత్నించడం, ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించడం వంటి చర్యలకు పాల్పడినట్టుగా ఫిర్యాదులో భర్త పేర్కొన్నట్టు వివరించింది. కాగా, ఇలాంటి చర్యల కారణంగా తాను నిత్యం భయంతో బతకాల్సి వచ్చిందని కోర్టుకు భర్త తెలిపాడు.
2018లో పెళ్లి.. 2019 నుంచి వేరు
ఈ కేసులోని వ్యక్తులకు 2018 మే నెలలో పెళ్లి అయ్యింది. 2019 నవంబర్ నుంచి వేర్వేరుగా ఉంటూ వచ్చారని న్యాయస్థానం గుర్తించింది. దంపతులను కలిపేందుకు భర్త, గ్రామ పెద్దలు అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, భార్య తిరిగి అత్తింటికి వెళ్లలేదు. అయితే, తాను ఎప్పుడూ భర్తతో కలిసి జీవించాలనుకున్నానని కోర్టుకు భార్య చెప్పడం విశేషం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125, గృహ హింస చట్టం కింద భర్తపై కేసు పెట్టిన తర్వాత అతడు విడాకులు కావాలని కోరాడంటూ భార్య వాదించింది.
ఇరువాదనలు ఉన్న న్యాయమూర్తు… సరైన కారణం ఏమీ లేకుండానే భర్తను భర్త విడిచిపెట్టి దూరంగా నివసించినట్టుగా సాక్ష్యాధారాలు రుజువైనట్టుగా హైకోర్టు అభిప్రాయపడింది. ఇక, మతం మారాలనే ఒత్తిడి ఆరోపణపై ఒక సామాజిక ప్రతినిధి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. భార్యతో పాటు ఆమె కుటుంబం కలిసి ఇస్లాం మతాన్ని స్వీకరించాలంటూ భర్తపై ఒత్తిడి చేసినట్టు ఆ సాక్షి కోర్టుకు చెప్పాడు. అయితే, ఇదంతా అబద్ధమని భార్య ఖండించింది. మరోవైపు, తనకు నెలకు రూ.2,000, మైనర్ కొడుకుకు రూ.2,000 చొప్పున ఇప్పటికీ మెయింటనెన్స్ పొందుతోందని హైకోర్టు గుర్తించింది. మొత్తంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ, విడాకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also- Sonia Gandhi: రేవంత్, వేరీగుడ్.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎంను అభినందిస్తూ సోనియా లేఖ

