Panchayat Elections: సర్పంచి ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నామినేషన్ తిరస్కరణ భయంతో ఓ కుటుంబంలో భార్యా, భర్త, కుమారుడు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ముగ్గురికి మూడు గుర్తులను కూడా ఈసీ కేటాయించింది. కానీ ప్రస్తుతం తండ్రిని గెలిపించుకోవాలని కొడుకు, భర్తను గెలిపించుకోవాలని భార్య, ఇలా ఒకే గుర్తుపై ముగ్గురు కలిసి వినూత్న ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే?
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి బిసి జనరల్ కు కేటాయించారు. ఈ గ్రామంలో 12 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ వేయగా అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బరిలో నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామానికి చెందిన పుల్ల సాయ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. గత సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన సాయ గౌడ్ కు పలు కారణాలతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ముందు జాగ్రత్తగా తన భార్య పుష్పలత, కుమారుడు వెంకటేష్ తో కూడా నామినేషన్ వేయించాడు.
నామినేషన్ల ఉపసంహరణకు నిరాకరణ
ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం గ్రామంలో సర్పంచ్ స్థానానికి వీడిసి వేలం వేస్తుందని ప్రచారం జరిగింది. దీంతో ఎన్నికల అధికారులు గ్రామంలోని వీడిసి సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. వారికి ఎన్నికపై అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగానే నిర్వహిస్తామని నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఎవరికి అవకాశం కల్పించడం లేదంటూ అధికారులు తేల్చి చెప్పారు. నామినేషన్లు ఉపసంహరించుకుందామని అధికారుల వద్దకు వెళ్తే జగ్గాసాగర్ గ్రామములో అభ్యర్థుల ఉపసంహరణ లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో గ్రామంలో నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ పోటీలోని ఉండిపోవాల్సి వచ్చింది.
Also Read: IndiGo crisis: ఇండిగో ఎఫెక్ట్.. కొండెక్కిన విమాన టికెట్ ధరలు.. కేంద్రం కఠిన ఆదేశాలు
ఒకే గుర్తు కోసం ముగ్గురు ప్రచారం..
ఈసీ అధికారుల నిర్ణయంతో మిగతా అభ్యర్థులతోపాటు పుల్ల సాయ గౌడ్ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు బరిలో నిలబడాల్సి వచ్చింది. అధికారులు వీరికి గుర్తులు కూడా కేటాయించారు. భార్యా పుష్పలతకు టీవీ రిమోటు, కుమారుడు వెంకటేష్ కు టూత్ పేస్ట్, సాయ గౌడ్ కు స్పానర్ (పానా) గుర్తులను అధికారులు కేటాయించారు. దీంతో ఏమి చేయలేని స్థితిలో సాయ గౌడ్ కుటుంబం ఆలోచనలో పడింది. అయితే సమయం తక్కువ ఉండడంతో ముగ్గురు కలిసి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ముందుగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకుని అనంతరం గ్రామంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. భార్య, కొడుతు ఇద్దరూ సాయ గౌడ్ కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఓటర్లు సైతం కన్ఫ్యూజ్ అవుతున్నారు. మెుత్తం మీద ఒకే ఇంట్లో ముగ్గురు అభ్యర్థులు ఉండటం, వారంతా తిరిగి ఒకే గుర్తుకు ఓటు వేయాలని కోరడం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

