Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యాపారవేత్తలు, ముఖ్యులకు ఆహ్వానాలు సైతం అందాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న ఇండిగో ఫ్లైట్స్ సమస్య ప్రభావం డిసెంబర్ 8-9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ పై పడకుండా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు ప్రారంభించారు. ఇండిగో సమస్య అధికంగా ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
‘ప్రత్యామ్నయ ఏర్పాట్లు’
ఇండిగో ఫ్లైట్స్ సంక్షోభంపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై దాని ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారని తెలిపారు. ‘ఇండిగో ఫ్లైట్స్ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో.. అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి తో తెలంగాణ డిప్యూటీ సీఎం ఇప్పటికే మాట్లాడారు. ఈ రోజు కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఇండిగో ఎఫెక్ట్ లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. విదేశాల ప్రతినిధులు రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నాం’ అని మంత్రి పొంగులేటి అన్నారు.
దిగ్గజాలకు అహ్వానం
తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ‘అనేక రంగాల్లో దిగ్గజాలను ఆహ్వానించాము. తెలంగాణ ప్రభుత్వం 2034 – 2047 వరకు రెండు విభాగాలుగా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది. 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ లో చేయబోయే అభివృద్ధి, ఆలోచనలు గ్లోబల్ సమ్మిట్ ద్వారా దేశానికి, ప్రపంచానికి తెలియజేస్తాం. ఒక బుక్ రూపంలో అభివృద్ధి విజన్ ప్రాజెక్ట్ ను ఈ సమ్మిట్ లో విడుదల చేస్తున్నాం. ఆదివారం సాయంత్రం డ్రై రన్ చేసి ప్రపంచంలోనే రోల్ మోడల్ సమ్మిట్ గా ఇది నిర్వహించబోతున్నాం’ అని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు.
Also Read: IndiGo Flight Crisis: కట్టలు తెంచుకున్న కోపం.. ఇండిగోపై తిరగడ్డ ప్రయాణికులు.. వీడియో వైరల్
ఇండిగో సంక్షోభం ఎందుకంటే?
కొత్తగా తీసుకొచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల కారణంగా పైలెట్లు, ఫ్లైట్ సిబ్బంది కొరత తలెత్తి ఇండిగోలో సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కొత్త FDTL ప్రకారం సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి గంటలు తప్పనిసరి. అయితే ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవడంలో ఇండిగో విఫలమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఎఫ్ డీఎల్ ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. మరో మూడు రోజుల్లో పరిస్థితి సర్దుబాటు కావొచ్చని అంతా ఆశీస్తున్నారు.

