IndiGo Flight Crisis: ఇండిగో విమాన సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు.. తాము వెళ్లాల్సిన ఫ్లైట్ బయలుదేరుతుందో? లేదో? తెలియక తీవ్ర అవస్థలు పడుతున్నారు. విమానశ్రయాల్లోనే గంటల తరపడి పడిగాపులు కాస్తున్న దృశ్యాలను దేశవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన ప్రయాణికులు.. పలు చోట్ల తీవ్ ఆందోళనకు దిగుతున్నారు.
విదేశీ మహిళ హల్ చల్..
ముంబయి విమానశ్రయంలో ఓ ఆఫ్రికన్ మహిళ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇండిగో సంస్థ కౌంటర్ పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఆమె ఊగిపోయిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. గత కొద్ది గంటలుగా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నాని.. తన వస్తువులన్నీ లగేజీలోనే ఉండిపోయాయని విదేశీ మహిళ ఆరోపించారు. వేసుకోవడానికి అదనపు బట్టలు సైతం తన వద్ద లేవని ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రాథమిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కౌంటర్ పైకి ఎక్కి ఈ వ్యాఖ్యలు చేస్తూ తోటి ప్రయాణికుల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు.
#WATCH | African woman climbs onto IndiGo counter, shouts at staff after flight cancellation. Video goes viral on social media.#IndigoDelay #IndiGoCrisis pic.twitter.com/N1tZQvGgKz
— The Times City (@TheTimesCity) December 6, 2025
‘కుటుంబంతో ఇరుక్కుపోయా’
రాయ్ పూర్ వెళ్లాల్సిన మరో ప్రయాణికుడు మాట్లాడుతూ.. తాను 8 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే చిక్కుకుపోయినట్లు తెలిపారు. ఏం చేయాలో పాలుపోవట్లేదని అన్నారు. ‘మా విమానం అకస్మాత్తుగా రద్దైంది. మేము చాలా టెన్షన్‌లో ఉన్నాం. గేట్ దగ్గర విమానం రద్దు అయ్యిందని మాత్రమే చెప్పారు. మరేం వివరాలు చెప్పలేదు. ఇప్పుడు మేం ఎనిమిది మంది ఎక్కడికి వెళ్లాలి?’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అవకాశాన్ని కోల్పోయిన మహిళ..
ఇండిగో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఒక మహిళ తన విమానం ఆలస్యమవడం వల్ల గువాహటిలో జరగాల్సిన హ్యాకథాన్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో అమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘మేము ఏడు నెలలుగా కష్టపడి చేసినదంతా వృథా అయింది. మేము ఇంటికి తిరిగి వెళ్తున్నాం. ఇలాంటి అవకాశాలు చాలా అరుదు’ అని ఆమె బృందంలోని ఒక సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: IND vs SA 3rd ODI: వైజాగ్‌లో నిర్ణయాత్మక మ్యాచ్.. మూడో వన్డే గెలిచేదెవరు? సిరీస్‌ను సాధించేదెవరు?
సంక్షోభానికి కారణమిదే!
ఇదిలా ఉంటే శనివారం ఉదయం కూడా దిల్లీ, ముంబయి విమానాశ్రయాల్లో వందకు పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల కారణంగా పైలెట్లు, ఫ్లైట్ సిబ్బంది కొరత తలెత్తి ఇండిగోలో సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కొత్త FDTL ప్రకారం సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి గంటలు తప్పనిసరి. అయితే ఇందుకు తగ్గట్లు ఏర్పాటు చేసుకోవడంలో ఇండిగో విఫలమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఎఫ్ డీఎల్ ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. మరో మూడు రోజుల్లో పరిస్థితి సర్దుబాటు కావొచ్చని అంతా ఆశీస్తున్నారు.

