IndiGo crisis: దేశంలోని అతి పెద్ద పౌర విమాన సేవల సంస్థ అయిన ఇండిగోలో అనూహ్యంగా సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. వరుసగా ఐదో రోజూ కూడా పెద్ద ఎత్తున విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే దీనిని ఆసారాగా చేసుకొని ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కఠిన ఆంక్షలను జారీ చేసింది.
ఛార్జీలపై పరిమితులు
ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో కొన్ని విమానయాన సంస్థలు అసాధారణంగా టికెట్ ధరలను పెంచడాన్ని పౌర విమాన మంత్రిత్వశాఖ తీవ్రంగా తప్పుబట్టింది. న్యాయసమ్మతమైన ఛార్జీలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు దోపిడి గురికాకుండా పలు విమానయాన సంస్థలపై నియంత్రణాధికారులను ప్రదర్శిస్తున్నట్లు స్పష్టం చేసింది. ‘దేశంలోని అన్ని విమానయాన సంస్థలు పాటించాల్సిన గరిష్ట ఛార్జీల పరిమితులను కేంద్రం నిర్ణయించింది. పరిస్థితి పూర్తిగా సర్దుబాటు అయ్యేంత వరకూ ఈ చార్జీ పరిమితులు అమల్లో ఉంటాయి’ అని కేంద్రం తేల్చి చెప్పింది.
రియల్ టైమ్ డేటాతో పర్యవేక్షణ
ఈ ఆదేశాల వెనకున్న ఉద్దేశ్యాన్ని కూడా కేంద్రం తాజా ప్రకటనలో తెలియజేసింది. మార్కెట్ లో విమాన టికెట్ ధరలు నియంత్రణలో ఉండేలా చూడటం, ప్రయాణికులను దోపిడి నుంచి కాపాడటం, అత్యవసరంగా ప్రయాణించాల్సిన వృద్ధులు, విద్యార్థులు, రోగులు వంటి వారిపై ఆర్థిక భారం పడగుండా చూడటం’ ఈ ఆదేశాల లక్ష్యమని విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనల మేరకు టికెట్ ధరలు ఉన్నాయా? లేదా? అని రియల్ టైమ్ డేటా ద్వారా పర్యవేక్షిస్తామని తెలియజేసింది.
‘బాధ్యతగా వ్యవహరించండి’
టికెట్ ధరలకు సంబంధించి విమానయాన సంస్థలు, ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫార్మ్‌లతో సమన్వయం కొనసాగిస్తామని విమానయాన శాఖ పేర్కొంది. తమ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విమానయాన సంస్థలను హెచ్చరించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రయాణికుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని వాటికి విజ్ఞప్తి చేసింది. ఇండిగో సంక్షోభానికి తోడు, విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం చర్యలు చేపట్టడం గమనార్హం.
ఇండిగోకు డెడ్ లైన్..
మరోవైపు సంక్షోభం ఎదుర్కొంటున్న ఇండిగో సంస్థకు సైతం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుల డబ్బును త్వరితగతిన రిఫండ్ చేయాలని ఆదేసించింది. రద్దు చేయబడిన లేదా అంతరాయం కలిగిన అన్ని విమాన సర్వీసులను డిసెంబర్ 7 రాత్రి 8 గం.ల లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రభావిత ప్రయాణికుల నుంచి రీషెడ్యూల్ ఛార్జీలను వసూలు చేయవద్దని సూచించింది. అలాగే లాక్ చేయబడిన ప్రయాణికుల లగేజీని వెంటనే గుర్తించి.. డోర్ డెలివరీ చేయాలని ఇండిగోను ఆదేశించింది.
Also Read: Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌పై ఇండిగో ఎఫెక్ట్? సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
ఇవాళ 400 సర్వీసులు రద్దు
ఇదిలా ఉంటే ఇండిగో సంస్థ దేశవ్యాప్తంగా రోజుకు 2,300 విమాన సర్వీసులను నడుపుతోంది. సొంతంగానే 400 విమానాలను ఈ సంస్థ కలిగి ఉంది. అటువంటి ఈ సంస్థలో పైలెట్లు, సిబ్బంది కొరత తలెత్తడంతో గత ఐదు రోజులుగా పలు సర్వీసులు రద్దవుతూ వస్తున్నాయి. శుక్రవారం ఏకంగా 1000 పైగా సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. శనివారం కూడా 400 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ముందే ఇండిగో ఫ్లైట్స్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

