CM Revanth Reddy: దేవరకొండ గడ్డ కాంగ్రెస్ పార్టీ కి అడ్డా కార్యకర్తలు మరోమారు నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రెండేళ్ల క్రితం ఓటునే ఆయుధంగా తెలంగాణను పట్టి పీడించిన నాయకులను ఓడించారని సీఎం గుర్తుచేశారు. నల్గొండ జిల్లాకు చైతన్యం.. ఇక్కడి గాలికి, నీరుకు పోరాట పౌరుషం ఉందని సీఎం పేర్కొన్నారు. సోనియా గాంధీ త్యాగం , అంబేద్కర్ ఇచ్చిన స్పూర్తితో తెలంగాణ రాస్ట్రానికి ఏర్పాటు చేసకున్నమని సీఎం పేర్కొన్నారు.
పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం
ప్రజా పాలనతో సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘గత 10 ఏళ్లలో పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న సోయి కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది. ప్రజలు చెప్పులు అరిగేలా తిరిగినా రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చి పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం. దేవరకొండలోనే 14 వేల రేషన్ కార్డులు మంజూరు చేశాం. 50 లక్షల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని బర్ల పెట్టే వారు. రేషన్ దుకాణం దగ్గరే అమ్ముకునే వారు. ప్రజా ప్రభుత్వంలో మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ ప్రజలు సన్న బియ్యంతో బువ్వ తింటున్నారు’ అని రేవంత్ అన్నారు.
4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు
తెలంగాణ వస్తే డబల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఒకాయన నమ్మబలికాడని కేసీఆర్ ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ అన్నారు. ‘డబుల్ బెడ్రూం ఇచ్చిన ఊరిలో మీరు ఓటు అడగాలి. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఊర్లో మేం ఓటు అడుగుతామని ఎన్నికల సమయంలో సవాల్ విసిరాం. ఆనాటి పాలకులకు పేదల పట్ల ఏ మాత్రం అభిమానం లేదు. రూ. 2000 కోట్లు ఖర్చు పెట్టి పదెకరాలలో 150 గదుల గడీని నిర్మించుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున 22 వేల కోట్లతో రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉండి ఉంటే 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే వాళ్లం’ అని రేవంత్ అన్నారు.
‘రైతుల నెత్తిన అప్పు పెట్టారు’
రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని కేసీఆర్ అన్నారని రేవంత్ గుర్తు చేశారు. కానీ రైతు నెత్తి మీద అప్పు పెట్టి ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం 25 లక్షల 35 వేల రైతు కుటుంబాలకు 20 వేల కోట్ల రుణమాఫి చేసిందని రేవంత్ అన్నారు. ‘వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అని నిరూపించాం. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు. రైతు బంధు రాదని కేసీఆర్ అన్నారు. ఉచిత కరెంటు పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీది. రైతులకు కాదు కేసీఆర్ ఇంట్లో కరెంటు లేదు. జనం పీజులు పీకేశారు. కాని రాష్ట్రంలో రైతులకు మాత్రం కరెంటు ఉంది’ అని రేవంత్ అన్నారు.
కేసీఆర్.. ఆశ తీరలేదా?
ఇటీవల ఇద్దరు సర్పంచ్ లు, నలుగురు వార్డు మెంబర్ల ను కూర్చోబెట్టుకుని కేసీఆర్ మాట్లాడారని రేవంత్ గుర్తుచేశారు. ‘వారికి మంచి రోజులు వస్తాయని కేసీఆర్ చెప్తున్నారు. కేసీఆర్ కు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. కొడుకు, బిడ్డ, అల్లుడు తెలంగాణను నాలుగు వైపుల నుంచి పీక్కు తిన్నారు. 8 లక్షల కోట్ల అప్పు చేసినా కేసీఆర్ ఆశ తీరలేదా?. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అధికారం పోయింది. పార్లమెంటు లో గుండు సున్నా వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకలేదు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: IND vs SA 2025 3rd ODI: వైజాగ్ వన్డేలో రాణించిన భారత బౌలర్లు.. టీమిండియా ముందు మోస్తరు టార్గెట్!
ఎస్‌ఎల్ బీసీ ని పూర్తి చేస్తాం
జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోరబండ దగ్గర బీఆర్ఎస్ ను బండకేసి కొట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్.. నీ కొడుకే నీకు గుది బండ. కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. తెలంగాణలో రెండేళ్లలో 61 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఎస్ ఎల్ బీసీ కోసం నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు అనేక పోరాటాలు చేశారు. కేసీఆర్ , ఆయన అల్లుడు నాగార్జున సాగర్ , శ్రీశైలంలో బండ కట్టుకుని దూకినా ఎస్ఎల్ బీసీ ని పూర్తి చేస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

