MS-Dhoni (
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

MS Dhoni: అసభ్య పదజాలంతో ధోనీ నన్ను తిట్టాడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni).. ‘కెప్టెన్ కూల్’గా ముద్రపడ్డాడు. మైదానంలో ప్రశాంతంగా ఉండి, టీమిండియాను, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎన్నో మ్యాచ్‌లలో గెలిపించాడు. కాబట్టే, అభిమానులు, క్రికెట్ విశ్లేషణకులు అతడిని ‘కెప్టెన్ కూల్’ అని అభివర్ణించేవారు. ప్రశాంతతకు మారుపేరైన ధోనీకి కోపం వచ్చిందని వినడం చాలా అరుదు. అయితే, టీమిండియా మాజీ పేసర్ మోహిత్ శర్మ మాత్రం ధోనీ కోపంతో తనను మైదానంలో దుర్భాషలాడాడంటూ ఓ ఘటనను పంచుకున్నాడు.

ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) టోర్నమెంట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌, చెన్నై మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పాడు. ‘‘మ్యాచ్ జరుగుతోంది. మాహీ భాయ్ (ధోనీ) ఇష్వర్ పాండేను బౌలింగ్‌కి పిలిచాడు. కానీ, సరిగ్గా వినపడక నన్ను పిలిచాడనుకొని బౌలింగ్‌కు వెళ్లాను. రన్నప్‌ కూడా చేసి బంతి సంధించడానికి చేరువవుతున్న సమయంలో ధోనీ ఆపాడు. నిజానికి ధోనీ పిలిచింది ఇష్వర్ పాండేను అని అప్పుడు అర్థమైంది. కానీ, నేను అప్పటికే రన్-అప్ చేయడంతో అంపైర్.. నేనే ఓవర్ కొనసాగించాల్సి ఉంటుందని చెప్పారు. దాంతో మాహీ భాయ్ నన్ను కోపంతో బూతులు తిట్టాడు’’ మోహిత్ శర్మ వివరించాడు. ‘క్రిక్‌ట్రాకర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నాడు. మోహిత్ శర్మ టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున కూడా ధోనీ నాయకత్వంలో ఆడాడు.

వికెట్ తీసినా ధోనీ కోపం చల్లారలేదు
తనపై ధోనీ కోప్పడిన ఘటనకు సంబంధించి మరో ఆసక్తికర కోణాన్ని కూడా మోహిత్ శర్మ పంచుకున్నాడు. అదే ఓవర్‌లో తాను వికెట్ తీసినప్పటికీ ధోనీ కోపం తగ్గలేదని, ఆగ్రహాన్ని అణుచుకోలేక పోయాడని వెల్లడించాడు. ‘‘ ఆ ఓవర్‌లో తొలి బంతికే యూసుఫ్ పఠాన్‌ను అవుట్ చేశాను. కానీ, సెలబ్రేషన్ సమయంలో కూడా మాహీ భాయ్ నన్ను బూతులు తిడుతూనే ఉన్నాడు’’ అని మోహిత్ నవ్వుతూ గుర్తు చేసుకున్నాడు.

Read also- Relief to KCR Harish Rao: కేసీఆర్, హరీశ్ రావులకు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఉత్తర్వులు

ప్రస్తుతం తన వయసు 36 సంవత్సరాలని, అయితే, ఒక యువ బౌలర్‌గా ఉన్నప్పుడు ధోనీ ఆ విధంగా కోపపడడం ఏవిధంగా అనిపించిందో కూడా మోహిత్ శర్మ చెప్పాడు. ‘‘నా జీవితంలో మాహీ భాయ్‌తో ముడిపడిన జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. ఆయనెప్పుడూ కూల్‌గా, ప్రశాంతంగా ఉంటారు. అలాంటి వ్యక్తి కోపపడతాడని ఎవరూ అనుకోరు. కానీ, ధోనీ నామీద అరిచినప్పుడు నాకు చాలా ఉత్సాహంగా అనిపించేది’’ అని గుర్తుచేసుకున్నాడు.

Read Also- Damodar Rajanarsimha: నిరుద్యోగ యువతులకు గుడ్ న్యూస్.. 6 వేలకు పైగా వైద్య ఉద్యోగాలు

కాగా, ధోనీ కెరీర్‌లో ఇది చిన్నపాటి ఘటనగా చెప్పవచ్చు. మోహిత్ శర్మ కెరీర్‌కు ధోనీ చాలా మద్దతు ఇచ్చాడు. 2013 నుంచి 2015 మధ్య కాలంలో మోహిత్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఏకంగా 47 మ్యాచ్‌లు ఆడాడు. 57 వికెట్లు కూడా సాధించి జట్టుకి ప్రధాన పేసర్‌గా రాణించాడు. ఆ సమయంలో ధోనీ ఎంతగానో ప్రోత్సహించాడు. ఇక, ఐపీఎల్ 2014లో పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) బౌలర్‌గా కూడా మోహిత్ శర్మ నిలిచాడు. అంతేకాదు, 2015 వన్డే వరల్డ్ కప్ భారత జట్టులో కూడా మోహిత్ శర్మ స్థానం దక్కించుకున్నాడు. ఆ సమయంలో ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది