Relief to KCR Harish Rao: తదుపరి విచారణ వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్ (KCR).. మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)లకు స్వల్ప ఊరట దక్కినట్టయ్యింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ ద్వారా న్యాయ విచారణ జరిపించిన విషయం తెలిసిందే. సుధీర్ఘ విచారణ జరిపి పలువురి నుంచి వాంగ్మూలాలు సేకరించిన కమిషన్ ఇటీవలే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ వెంటనే ఈ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చ జరిపిన తరువాత చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: Viral Video: వరద కవరేజ్ కోసం వెళ్లి.. పాక్ మహిళా జర్నలిస్టు.. ఎలా వణికిపోయిందో చూడండి!
అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)పై కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టి వేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ సెక్షన్ 8బీ ప్రకారం తమకు నోటీసులు ఇవ్వకుండానే కమిషన్ నివేదిక ఇచ్చిందని వాటిలో పేర్కొన్నారు. ఈ రెండు పిటిషన్లపై మంగళవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ సెక్షన్ 8బీ ప్రకారం తమ క్లయింట్లకు నోటీసులు ఇవ్వకుండానే కమిషన్ నివేదిక ఇచ్చిన విషయాన్ని మరోసారి చెప్పారు. ఇది కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ ను ఉల్లంఘించటమే అని తెలిపారు. నివేదికను హడావిడిగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రాజకీయంగా తమ క్లయింట్ల ప్రతిష్టను దెబ్బ తీయటానికే ఇలా చేస్తున్నారన్నారు.
Also Read: Damodar Rajanarsimha: నిరుద్యోగ యువతులకు గుడ్ న్యూస్.. 6 వేలకు పైగా వైద్య ఉద్యోగాలు
కాగా, ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లకు విచారణార్హత లేదని వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణను సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. పీ.సీ.ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదన్నారు. నేషనల్ డ్యాం సెక్యూరిటీ ఏజన్సీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు పీ.సీ.ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.