Viral News: పదో తరగతి అర్హతతో కూడా చాలా ఉద్యోగాలు ఉంటాయి. కానీ, హోదా, జీతాలు అంత పెద్దగా ఆశించలేం. టెన్త్ క్లాస్ అర్హతతో జాబ్ చేసే వ్యక్తులు పెద్దగా డబ్బు సంపాదిస్తారని ఈ రోజుల్లో అస్సలు భావించలేం. ఎందుకంటే, బయట ఉద్యోగ మార్కెట్‌లో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అయితే, 10వ తరగతి చదివిన ఓ వ్యక్తి 25 ఏళ్ల వ్యవధిలోనే ఏకంగా ఒక కోటి రూపాయలు (Viral News) పొదుపు చేశాడు. ఇంతకీ అతడు చేసిన ఉద్యోగం ఏమిటంటే ‘ ప్రూఫ్‌రీడర్’.
బెంగళూరుకు చెందిన శ్రీకవిగ్ అనే వ్యక్తి ఈ అసాధారణ ఫైనాన్షియల్ మైలురాయిని సాధించాడు. ‘‘జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాను. రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవడానికి 25 ఏళ్లు పట్టింది’’ అంటూ రెడిట్‌లో అతడు రెండు రోజులక్రితం తన ఆదర్శవంతమైన జీవిత ప్రయాణాన్ని పంచుకున్నాడు. దీంతో, చాలామంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లక్ష్యానికి కట్టుబడి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం, సాదాసీదా జీవనశైలి గడిపి ఉంటారంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.
కాగా, ఏదైనా ఒక డాక్యుమెంట్‌ను చివరి దశలో క్షుణ్ణంగా చదివి ఫైనల్ ఆమోదం తెలిపే నిపుణులనే ప్రూఫ్‌రీడర్లు అంటారు. సిద్ధమైన డాక్యుమెంట్స్‌లోని తప్పులు, లోపాలు, ముద్రణ పొరపాట్లు, వ్యాకరణం, పదప్రయోగం తప్పులను సరిదిద్దడం వంటివి చేస్తుంటారు.
Read Also- Viral Video: వరద కవరేజ్ కోసం వెళ్లి.. పాక్ మహిళా జర్నలిస్టు.. ఎలా వణికిపోయిందో చూడండి!
శ్రీకవిగ్ 2000వ సంవత్సరంలో ప్రూఫ్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆరంభంలో రూ.5,000 కంటే తక్కువ వేతనంలో ఉద్యోగంలో చేరాడు. అర్హత పదో తరగతే కావడంతో రూ.4200 జీతంతో ఉద్యోగంలో చేరాడు. అయితే, అతడిలో కష్టపడేతత్వం, నిబద్ధతల కారణంగా క్రమంగా ఆయన జీతం రూ.63,000 కు పెరిగింది. మంచి జీతమే సంపాదిస్తున్నా తాను ఏనాడూ విలాసాలకు పోలేదని ఆయన చెప్పాడు. కారు, ఇల్లు వంటి వాటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, లక్ష్యం ప్రకారం పొదుపు కోసమే బతుకానని వివరించాడు. చాలా వ్యయాలు తగ్గించుకున్నానని పేర్కొన్నాడు.
ఇల్లు కొనే స్థోమత ఉన్నా, కొనలేదని, అద్దె ఇంట్లో ఉంటూ వచ్చానని తెలిపాడు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల ద్వారా మాత్రమే పొదుపును పెంచుకుంటూ వచ్చానని, ఎప్పుడూ అప్పులు తీసుకోలేదని శ్రీకవిగ్ తెలిపాడు. అవసరానికి మించి ఎప్పుడూ ఖర్చు పెట్టలేదన్నాడు. మొత్తానికి 48 ఏళ్ల వయసులో రూ.1 కోటికి పైగా పొదుపు చేశానని సంతోషంగా చెప్పాడు.
Read Also- Azerbaijan on India: భారత్ మా దేశాన్ని పగబట్టింది.. అజర్‌బైజాన్ సంచలన ఆరోపణ
శేష జీవితం స్వగ్రామంలోనే…
స్వగ్రామంలో తమ కుటుంబానికి చెందిన ఒక పాత ఇల్లు ఉందని, జీవితాన్ని చివరి దశను అక్కడే గడపాలని తాము నిర్ణయించుకున్నామని శ్రీకవిగ్ చెప్పాడు. ‘‘మొదటి నుంచి చాలా పొదుపుగా బతికాం. ఎందుకంటే, సహాయం అడగడానికి కూడా మాకు ఎవరూ లేరు. అదృష్టం కొద్దీ ఇప్పటివరకు మాకు ఎలాంటి పెద్ద అనారోగ్య సమస్యలు, లేదా కష్టాలు ఎదురుకాలేదు’’ అని రాసుకొచ్చారు. ‘‘ఆరోగ్యం విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. అందుకే, డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరం చాలా తక్కువ సందర్భాల్లో వచ్చింది. నా స్వీయ అనుభవం ద్వారా చెప్పాలంటే.. చదువు, తెలివి, ఆరోగ్యం, విలువైన సమయం ఇవే అసలుసిసలైన ఆస్తులు. దీర్ఘకాల లక్ష్యాలు సాధించాలంటే అలసట లేని శ్రమ, సహనంతో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరం’’ అని శ్రీకవిగ్ హితబోధచేశాడు. ఒక ప్రూఫ్‌రీడర్ ఉద్యోగంతో కోటీశ్వరుడు కావడమంటే మామూలు విషయం కాదంటూ చాలామంది నెటిజన్లు శ్రీకవిగ్‌ను మెచ్చుకుంటున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.