IND vs SA 4th T20I: నేడు భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాల్గో టీ20 మ్యాచ్ జరగనుంది. లక్నోలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ ల సిరీస్ లో 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్ లోనూ విజయం సాధిస్తే సిరీస్ కైవసం కానుంది. దీంతో దక్షిణాఫ్రికా జట్టుకు నేటి మ్యాచ్ అసలైన పరీక్షగా నిలవనుంది.
సూర్య, గిల్ ఫామ్‌పై ఆందోళన..
టీమిండియా టీ-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్ ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ జరిగిన టీ20 మ్యాచుల్లో సూర్య దారుణంగా విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన గత మూడు మ్యాచుల్లో వరుసగా 12, 5, 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో నాల్గో టీ20లోనైనా సూర్య ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ (Shubman Gill) పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన గిల్.. బ్యాటింగ్ లో తడబడుతున్నాడు. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.
పిచ్, వాతావరణ రిపోర్ట్..
లక్నో పిచ్ ను.. ఆల్ రౌండర్ పిచ్ గా చెప్పవచ్చు. ప్రారంభ ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు సైతం ప్రభావం చూపవచ్చు. ఇక నిలదొక్కుకుంటే బ్యాటర్లు పరుగుల వరద పారించవచ్చు. వాతావరణం విషయానికి వస్తే ఎలాంటి వర్ష సూచన లేదు. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రతలు 16°Cగా ఉంటుందని అంచనా. గాలిలో తేమ శాతం 80-90 శాతం మధ్య ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మ్యాచ్ పై డ్యూ ప్రభావం ఉండొచ్చు. ఫలితంగా తొలుత టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ వైపే మెుగ్గు చూపే ఛాన్స్ ఉంది.
దక్షిణాఫ్రికాపై మనదే పైచేయి..
భారత్ – దక్షిణాఫ్రికా హెడ్ టూ హెడ్ టీ20 మ్యాచ్ ల విషయానికి వస్తే.. టీమిండియాదే పైచేయిగా ఉంది. ఇప్పటివరకూ 34 మ్యాచుల్లో ఇరు జట్లు తలపడగా.. భారత్ 20 మ్యాచ్ లలో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 13 గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించడం విశేషం. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ నేటి మ్యాచ్ లోనూ విజయం సాధించాలని సూర్యకుమార్ నేతృత్వంలోని యువ ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు.
Also Read: TG Panchayat Elections 2025: ప్రశాంతంగా పంచాయతీ పోలింగ్.. ఉత్సాహాంగా ఓట్లు వేస్తోన్న పల్లెవాసులు
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్ – దక్షిణాఫ్రికా నాల్గో టీ20 మ్యాచ్ ను జియో హాట్ స్టార్ (JioHotstar) యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. టీవీలో స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఆ రెండింటిలోనూ అభిమానులు మ్యాచ్ ను వీక్షించవచ్చు.

