Pawan Kalyan: వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
నిమిషాల వ్యవధిలోనే పని పూర్తి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్‌గా ఎంపికైన లాకే బాబూరావు
నియామక పత్రాల కార్యక్రమంలో గ్రామానికి రోడ్డు సౌకర్యం కావాలంటూ అభ్యర్థన
రోడ్డు బాధ్యతను డిప్యూటీ సీఎంకి అప్పగించిన సీఎం చంద్రబాబు
నిమిషాల్లో 2 కి.మీ. రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు
రూ. 2 కోట్లు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్
సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశంసలు
అమరావతి: తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందిస్తున్న తీరు, చూపుతున్న చొరవపై అభినందనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఆయన మరో సమస్యకు నిమిషాల వ్యవధిలో పరిష్కారం చూపించి ప్రశంసలు పొందుతున్నారు. కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా ఒక విన్నపం విన్న పవన్, నిమిషాల వ్యవధిలోనే పరిష్కారం చూపించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన బాబూరావు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. నియామక పత్రాల ప్రదాన కార్యక్రమంలో ఆ గిరిజన యువకుడు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో, తన గ్రామానికి రోడ్డు వేయించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరాడు. బాబూరావు కోరిక మేరకు అతడి గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపైనే ఉన్న డిప్యూటీ సీఎం పవన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు.
దీంతో, పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని సూచించారు. పవన్ ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం, తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్లతో అంచనాతో పనులను సిద్ధం చేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌కు తెలియజేశారు. ఆ తర్వాత పవన్ ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేసినట్టు అయింది. దీంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Read Also- Errolla Srinivas: రాష్ట్రంలో పోలీసు శాఖలో అసమర్థులకు కీలక పదవులు.. అందుకే గన్ కల్చర్..!

