Panchayat Elections: నల్గొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో నేడు మూడవ దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోరు జరగనుంది. రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా మొత్తం 269 గ్రామపంచాయతీలు, 2207 వార్డులు ఉన్నాయి. ఇందులో 42 జీపీలు, 506 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కాగా మిగిలిన 227 గ్రామ పంచాయతీలకు, వివిధ కారణాలతో 7 వార్డులకు నామినేషన్ దాఖలు కాకపోవటంతో 1603 వార్డులకు పోలింగ్ జరగనుంది.
మొదటి, రెండవ దశ ఎన్నికల్లో హస్తం జోష్..
నల్గొండ(Nalgonda), చండూరు(Chanduru), మిర్యాలగూడ(Miryalaguda) రెవెన్యూ డివిజన్ ల పరిధిలో మొదటి, రెండవ దశ ఎన్నికల్లో 597 గ్రామ పంచాయతీలకు, వార్డులకు జరిగిన ఎన్నికల్లో 60 శాతానికి పైగా కాంగ్రెస్(Congress) పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. పలుచోట్ల ఏకగ్రీవం కాగా మరిన్ని స్థానాలను గెలుచుకున్నారు. 12 ఏళ్ల అనంతరం పల్లె ఓటర్లు హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టడంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. ఇదే క్రమంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించిన దేవరకొండ రెవెన్యూ డివిజన్(Devarakonda Revenue Division) లో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి మెజారిటీ స్థానాలు దక్కనున్నాయని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలిచినప్పటికీ బీఆర్ఎస్(BRS) సైతం గ్రామపంచాయతీ ఎన్నికల్లో పలచోట్ల గట్టి ఫైట్ ఇచ్చిన నేపథ్యంలో దేవరకొండ రెవెన్యూ డివిజన్ పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.
పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి
మూడవ దశ ఎన్నికల పరిశీలనలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) దేవరకొండ డిఆర్‌సి కేంద్రాన్ని తనిఖీ చేసి పోలింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 227 గ్రామ పంచాయతీలకు, 1603 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. 226 పోలింగ్ లొకేషన్లు, 81 మంది స్టేజ్_1 ఆర్వోలు, మరో 81 మంది స్టేజ్_ ఏఆర్‌వో లను, 9 మంది ఖర్చుల పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. 52 మంది జోనల్, 300 మంది స్టేజి టు ఆర్వోలు, 83 మంది రూట్ ఆఫీసర్లతో పాటు 5606 పివో, ఓపీవో లు పోలింగ్ డ్యూటీలో ఉండనున్నారని చెప్పారు. 236 గ్రామపంచాయతీలలో వెబ్ క్యాస్టింగ్, 89 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని ఆమె వెల్లడించారు. 2647 బ్యాలెట్ బాక్స్ లను, 227 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ బూత్ లో కిటికీలకు దూరంగా కంపార్ట్ మెంట్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ముగ్గురికి ఓటర్లు ఉండకూడదన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sharath Chandra Pawar)మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఇన్ టైంలో కంప్లీట్ చేయాలన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
Also Read: Polling Staff Protest: మధ్యాహ్న భోజనం దొరకక ఎన్నికల పోలింగ్ సిబ్బంది నిరసన

