Polling Staff Protest: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలు బుధవారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఖేడ్ డివిజన్లోని 7 మండలాలకు చెందిన 196 గ్రామపంచాయతీల పోలింగ్ సిబ్బందికి మంగళవారం నారాయణఖేడ్ డిగ్రీ కళాశాల(Narayankhed Degree College) ఆవరణలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. అయితే మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా సగానికి పైగా పోలింగ్ సిబ్బందికి భోజనం అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ప్లేట్లు చేతబట్టి పోలింగ్ సిబ్బంది నిరసనకు దిగారు. ఎన్నికల ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని వారు ఆరోపించారు.
పోలింగ్ సిబ్బంది ఆవేదన
డ్యూటీకి రాకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరిస్తారని, కానీ విధులకు హాజరైన సిబ్బందికి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం అన్యాయమని పోలింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీకి రాకపోతే ఒక రకమైన ఒత్తిడి, వస్తే సరైన భోజనం కూడా లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇంతటి కీలక ఎన్నికల సమయంలో ఇలాంటి నిర్లక్ష్యం సరికాదని, తక్షణమే అధికారులు స్పందించి సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పోలింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు.
Also Read: Medak District: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

