Chris Gayle: క్రిస్ గేల్… క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. యూనివర్స్ బోస్, సిక్సర్ల యంత్రం, బిగ్ మ్యాన్, మాస్టర్ ఆఫ్ టీ20… ఇలా అభిమానులు చాలా పేర్లతో పిలుచుకుంటుంటారు. అంతటి గౌరవప్రదమైన ఆటగాడినైన తనకు ఐపీఎల్‌లో తగిన గౌరవం దక్కలేదని, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తనను అగౌరవపరిచిందని క్రిస్ గేల్ (Chris Gayle) సంచలన ఆరోపణలు చేశాడు. ఆ జట్టులో చేదు జ్ఞాపకాలు మిగిలాయని, ఆ సమయంలో మానసిక ఒత్తిడిలోకి (డిప్రెషన్) వెళ్తున్నట్టుగా కూడా అనిపించిందని చెప్పాడు. జట్టు తరపున ప్రదర్శన విషయంలో గణాంకాలు ఉత్తమంగా ఉన్నప్పటికీ అనుభవాలు మాత్రం చేదుగా మిగిలాయని, అంతగా అవమానించారని పేర్కొన్నాడు. శుభాంకర్ మిశ్రా నిర్వహిస్తున్న ‘క్రికెట్‌బుక్’ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ క్రిస్ గేల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
కుంబ్లేతో మాట్లాడుతూ ఏడ్చేశాను
పంజాబ్ కింగ్స్ జట్టులో తన ప్రయాణంపై క్రిస్ గేల్ మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఐపీఎల్‌లో పంజాబ్ జట్టుతో నా ప్రయాణం తక్కువ కాలంలోనే ముగిసింది. ఆ జట్టులో నాకు గౌరవం ఇవ్వలేదు. ఐపీఎల్‌కి నేను ఎంతో ఇచ్చాను. లీగ్‌కి విలువ జోడించడంలో కీలక పాత్ర పోషించాను. అయినా, నన్ను చిన్నపిల్లాడిలా ట్రీట్ చేశారు. జీవితంలో తొలిసారిగా నేను డిప్రెషన్‌లోకి వెళ్తున్నానని అనిపించింది. అనిల్ కుంబ్లేతో మాట్లాడేటప్పుడు ఏడ్చేశాను. ఎందుకంటే నేను బాగా గాయపడ్డాను. అనిల్ కుంబ్లే విషయంలో, ఫ్రాంఛైజీ నిర్వహణ పట్ల తీవ్రంగా నొచ్చుకున్నాను’’ అని క్రిస్ గేల్ పేర్కొన్నాడు.
Read Also- Vice President Election: రేపే ఎన్నిక.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు?.. క్రాస్ ఓటింగ్ టెన్షన్!
కేఎల్ రాహుల్ ఫోన్ చేశాడు..
పంజాబ్ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన క్రిస్ గేల్ మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకున్నాడు. ఆ టైమ్‌లో కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ తనకు ఫోన్ చేసి మాట్లాడాడని, తర్వాతి మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందని హామీ ఇచ్చినట్టు తెలిపాడు. అయితే, తాను మాత్రం సింపుల్‌గా ఆల్ ది బెస్ట్ చెప్పేసి, లగేజీ సర్దుకొని వెళ్లిపోయానని క్రిస్ గేల్ గుర్తుచేసుకున్నాడు. కాగా ,క్రిస్ గేల్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని జట్ల కంటే పంజాబ్ కింగ్స్‌పైనే ఎక్కువ పరుగులు సాధించడం విశేషం. పంజాబ్ కింగ్స్‌పై మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 797 పరుగులు సాధించాడు.
క్రిస్ గేల్ టీ20 క్రికెట్‌కు పర్యాయపదం లాంటివాడని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తుంటారు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ XI పంజాబ్) తరపున 2018 నుంచి 2021 వరకు ఆడాడు. ఓపెనర్‌గా బరిలోకి అద్భుతంగా రాణించాడు. నాలుగేళ్ల కాలంలో పంజాబ్ కింగ్స్ తరపున మొత్తం 41 మ్యాచ్‌లు ఆడి 1,304 పరుగులు బాదాడు. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 104 (నాటౌట్), సగటు – 40.75, స్ట్రైక్ రేట్ – 148.65గా ఉన్నాయి. అయినప్పటికీ అవమానం జరిగిందంటూ క్రిస్ గేల్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి. పంజాబ్ జెర్సీలో గేల్ చాలా సిక్సర్లు బాదాడని, అవి ఇంకా గుర్తున్నాయని అభిమానులు చెబుతున్నారు.
Read Also- Weight Loss Challenge: కొవ్వు కరిగించుకో.. రూ.లక్షల్లో బోనస్ దక్కించుకో.. ఉద్యోగులకు బంపరాఫర్!