Weight Loss Challenge: చైనాకు చెందిన ఓ టెక్ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. బరువు తగ్గించుకునే ఉద్యోగుల కోసం వన్ మిలియన్ యువన్ (సుమారు రూ.1.23 కోట్లు) బోనస్ ప్రకటించుకుంది. షెన్‌జెన్‌లో ఉన్న అరాషి విజన్ ఇన్క్ (Arashi Vision Inc) ఆగస్టు 12న తన వార్షిక ‘మిలియన్ యువాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్’ ప్రారంభించింది. ఉద్యోగులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం, ఆరోగ్యకర జీవన శైలి అవలంభించేలా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ ఆఫర్ ప్రకటించింది.
షరతులు వర్తిస్తాయ్..
బరువు తగ్గి బోనస్ పొందాలని భావించే ఉద్యోగులు ముందుగా.. రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ 500 గ్రాముల వెయిట్ లాస్ కు 500 యువాన్ (సుమారు రూ.6,100)ను కంపెనీ బహుమతిగా అందించనుంది.
ఈ ఏడాది విజేత
జెన్ జెడ్ ఉద్యోగి జీ యాకీ కేవలం 90 రోజుల్లో 20 కిలోలు తగ్గి ‘వెయిట్ లాస్ చాంపియన్’ టైటిల్ గెలుచుకుంది. ఆమెకు 20,000 యువాన్ (సుమారు రూ.2.47 లక్షలు) నగదు బహుమతిని కంపెనీ అందించింది. క్రమశిక్షణ, నియంత్రిత ఆహారం, రోజూ 1.5 గంటల వ్యాయామంతో ఇది సాధ్యమైందని జీ యాకీ తెలిపారు. ‘ఇది నా జీవితంలో నన్ను నేను ఉత్తమంగా మార్చుకునే సమయం. ఇది కేవలం అందం కోసం కాదు – ఆరోగ్యం కోసం,” అని.
‘చిన్ హావో వెయిట్ లాస్ పద్ధతి’
జెన్-జెడ్ ఉద్యోగి జీ యాకీ బరువు తగ్గేందుకు తను అనుసరించిన చిన్ హావో వెయిట్ లాస్ పద్దతిని తెలియజేసింది. తోటి ఉద్యోగులకు దాని గురించి తెలియజేసి వారిలోనూ ప్రేరణ నింపింది. ఈ విధానం.. ఒకప్పుడు చైనీస్ నటుడు చిన్ హావోకి 15 రోజుల్లో 10 కిలోలు తగ్గడంలో సహాయపడింది. ఇందులో పరిమితమైన ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక రోజు కేవలం సోయా మిల్క్, మరొక రోజు కేవలం మెుక్కజొన్న లేదా పండ్లు తీసుకోవాల్సి ఉంటుంది.
2022 నుంచి ఏడు సార్లు..
2022 నుండి ఇప్పటివరకు కంపెనీ 7 రౌండ్లు నిర్వహించింది. ‘మిలియన్ యువాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్’ నిర్వహించింది. గత ఏడాది 99 మంది ఉద్యోగులు ఓవరాల్ గా 950 కిలోలు తగ్గి 1 మిలియన్ యువాన్ పంచుకున్నారు. కంపెనీ ప్రతినిధి దీని గురించి మాట్లాడుతూ ‘ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఛాలెంజ్ తీసుకొచ్చాం. ప్రతీ ఉద్యోగి ఉత్సాహంగా పని చేయాలి. ఈ ఛాలెంజ్ పని-జీవితం రెండింటిలోనూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది’ అని తెలిపారు.
Also Read: Viral Video: రెస్టారెంట్‌లో సీటు లొల్లి.. ఘోరంగా కొట్టుకున్న.. హోటల్ స్టాఫ్, కస్టమర్లు!
పెనాల్టీ కూడా ఉంది!
అయితే ఒకసారి బరువు తగ్గిన వారు మళ్లీ పెరిగితే ప్రతి 500 గ్రాములకు 800 యువాన్ (సుమారు రూ.9,800) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఎవరూ ఫైన్ కట్టాల్సిన పరిస్థితి రాలేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే 2024 జూన్‌లో చైనా ప్రభుత్వం ‘వెయిట్ మేనేజ్‌మెంట్ ఇయర్’ పేరుతో మూడు సంవత్సరాల ప్రణాళిక మొదలుపెట్టింది. పెరుగుతున్న ఊబకాయం సమస్యను అరికట్టి వ్యాయామం, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.