Vice President Election: దేశానికి తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు?.. ఉత్కంఠ రేపుతున్న ఈ ప్రశ్నకు రేపు (మంగళవారం) సమాధానం దొరుకుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక, (Vice President Election) ఫలితం కూడా మంగళవారమే రానుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు ఖాయమంటూ తొలి నుంచీ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, మునుపటి ఎన్నికల మాదిరిగా ఈసారి అంతపెద్ద మెజారిటీతో విజయం సాధించే పరిస్థితులు లేవని, తక్కువ మార్జిన్‌తో గెలుపు ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే, ప్రతి ఓటును ఎన్‌డీఏ చాలా జాగ్రత్తగా గమనిస్తోందని ఢిల్లీ రాజకీయవర్గాలు చెబుతున్నాయి. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. అందుకే, ఎన్డీయే వర్గాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
మెజార్టీ మార్క్ 391 ఓట్లు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి మొత్తం 781 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో 239 మంది, లోక్‌సభలో 542 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మెజార్టీ మార్క్ 391 ఓట్లుగా ఉంది. ఎన్‌డీఏ వైపు మొత్తం 425 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు ఖాయమేనని చెబుతున్నారు.
ఎన్డీయేకి బలంగా వైసీపీ మద్దతు
2022 ఉపరాష్ట్రపతి ఎన్నికల మాదిరిగానే ,ఈసారి కూడా ఎన్డీఏలో భాగం కాని కొన్ని కీలక పార్టీలు మద్దతు ఇస్తాయని బీజేపీ ఆశిస్తోంది. ముఖ్యంగా, ఇటు ఎన్డీయే, అటు విపక్షాల కూటమిలో లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ప్రకటించింది. జగన్ సారధ్యంలోని వైసీపీ వద్ద ఉభయ సభల్లో కలిపి 11 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఏడుగురు, లోక్‌సభలో నలుగురు ఉన్నారు. ఈ మద్దతు ఎన్డీఏకి మరింత బలం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also- CM Revanth Reddy: హాట్ టాఫిక్ గా మారిన ఎమ్మెల్యేల భేటీ.. సీఎం హామీ..?
బీఆర్‌ఎస్, బీజేడీ మద్దతుపై అనిశ్చితి
ఉపరాష్ట్రపతి ఎన్నికలో అనుసరించాల్సిన వైఖరిపై బీఆర్‌ఎస్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆ పార్టీకి నలుగురు ఎంపీల బలం ఉంది. కానీ, ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కేసీఆర్ కూతురు కవిత ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, బీజేపీ-కాంగ్రెస్ కక్ష సాధింపునకు పాల్పడుతున్నాయని భావిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నికలో ముస్లింల ఓట్ల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్ జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ఓటింగ్‌పై దూరంగా ఉండేందుకు మొగ్గుచూపవచ్చు. ఇక, ఒడిశాకు చెందిన బీజేడీ మద్దతు ఎవరికి అనే విషయంలో కూడా అనిశ్చితి కొనసాగుతోంది. బీజేడీ వద్ద ఏడుగురు ఎంపీలు ఉన్నారు. ఎన్డీయేకి మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలు ఉన్నప్పటికీ, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో పరాజయం పాలైన నాటి నుంచి బీజేడీ ఆచితూచి వ్యవహరిస్తోంది.
బీఆర్‌ఎస్, బీజేడీ మద్దతు లేకపోయినా, ఎన్డీఏ వద్ద ఇప్పటికే 436 ఓట్లు ఉన్నాయి. విజయానికి అవసరమైన మెజార్టీ మార్క్ 391 కంటే చాలా ఎక్కువ సంఖ్యలోనే సభ్యులు ఉన్నారు. అందుకే, సీపీ రాధాకృష్ణన్ గెలుపు ఖాయమంటూ విశ్లేషణలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఎన్డీయేకి మరికొందరి మద్దతు కూడా!
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాళివాల్ కూడా ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేయవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ సన్నిహితుడు తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ పార్టీతో ఆమె విభేదించారు. మాళివాల్ బీజేపీలో చేరే సూచనలు ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఇంకా చేరలేదు. ఈ పరిణామాల నేపథ్యంల ఆమె ఎటువైపు ఓటు వేస్తారనేది ఆసక్తికర అంశం కానుంది. మరోవైపు, లోక్‌సభలో ప్రస్తుతం ఏడుగురు స్వతంత్ర ఎంపీలు ఉన్నారు. వారంతా ఎవరి పక్షాన నిలబడతారన్నది ఇంకా తెలియరాలేదు. ఇక, ఒక్కొక్క ఎంపీ ఉన్న అకాళీ దళ్ (పంజాబ్), జెడ్‌పీఎం (మిజోరాం) ఎటువైపు నిలుస్తాయో తెలియాల్సి ఉంది. వీళ్లంతా అధికార ఎన్డీయే వైపు ఓటు వేస్తే మొత్తం 458 ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. 2022లోజగదీప్ ధన్కడ్ సాధించిన 528 ఓట్ల కన్నా తక్కువే అయినా, గెలుపునకు సరిపోతాయి.
Read Also- Anuparna Roy: వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చరిత్ర సృష్టించిన దర్శకురాలు.. ఇది కదా కావాల్సింది
విపక్షాల వద్ద ఎన్ని ఓట్లు?
ఉపరాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఇండియా కూటమి కాంగ్రెస్ సారధ్యంలో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగు వ్యక్తి బీ. సుదర్శన్ రెడ్డిను అభ్యర్థిగా నిలిపాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం, విపక్షాల వద్ద మొత్తం 324 ఓట్లు ఉన్నాయి. విజయం సాధించే అవకాశముందా? అంటే, దాదాపు లేనట్టేనని ప్రస్తుత సమీకరణాలను బట్టి చెప్పవచ్చు. అయితే, 2022తో పోలిస్తే గట్టి పోటీ మాత్రం ఇవ్వగలుతాయి. 324 ఓట్లతో విపక్ష అభ్యర్థి గెలవడం అసాధ్యం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలంటే మరో 100 నుంచి 135 ఓట్లు అవసరం అవుతాయి.
బీఆర్ఎస్, బీజేడీ, ఇతరులు మద్దతిచ్చినా?
బీఆర్ఎస్, బీజేడీ, స్వాతి మాళివాల్, స్వతంత్ర ఎంపీలు అనూహ్యంగా ఇండియా అభ్యర్థిగా మద్దతిచ్చినా గెలుపు సాధ్యం కాదు. ఆఖరికి వైఎస్సార్ కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చినా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు సాధ్యంకాదు. కనీసం మరో 70 ఓట్లు కావాల్సి ఉంటుంది. పైగా, రాజ్యసభ సభ్యుల్లో చాలామంది క్రాస్ ఓటింగ్‌కు పాల్పడవచ్చనే విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే, ఇండియా కూటమికి మరింత నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని ఇండియా కూటమి కోరుతోంది.