IND vs PAK: ఆసియా కప్ 2025లో భారత్ – పాక్ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై దాయాది దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. భారత ఆటగాళ్లు తమ ప్లేయర్లకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా క్రీడా స్ఫూర్తి దెబ్బతినేలా వ్యవహరించారని పాక్ జట్టు కోచ్ తో పాటు ఆ జట్టు మాజీలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తొలిసారి ఈ షేక్ హ్యాండ్ రగడపై స్పందించింది. బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘అలా చేయాలన్న రూల్ లేదు’
పాక్ తో షేక్ హ్యాండ్ వివాదంపై ఓ బీసీసీఐ అధికారి తాజాగా స్పందించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం.. కేవలం ఒక స్నేహపూర్వక సంకేతమే తప్ప తప్పనిసరి కాదని ఆయన తెలిపారు. ‘మ్యాచ్ తర్వాత తప్పనిసరిగా చేతులు కలపాలని ఎలాంటి నిబంధన లేదు. ఇది కేవలం ఆచారంగా మంచితనానికి సంకేతంగా అనుసరించబడుతున్న సంప్రదాయం మాత్రమే. కానీ అది చట్టం కాదు. భారత్ – పాక్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఉన్న ఈ పరిస్థితుల్లో ఆటగాళ్లు చేతులు కలపకపోవడంలో ఎలాంటి తప్పులేదు’ అని బీసీసీఐ సీనియర్ అధికారి అన్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ (PTI) పేర్కొంది.
మ్యాచ్ రిఫరీపై పాక్ ఫిర్యాదు
మరోవైపు షేక్ హ్యాండ్ వివాదాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB).. భారత్ – పాక్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పై ఫిర్యాదు చేసింది. పీసీబీ చీఫ్ గా ఉన్న మెుహ్సిన్ నక్వీ.. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్ గానూ వ్యవహరిస్తున్నారు. ఆసియా కప్ నిర్వహణలో ఐసీసీకి సంబంధం లేకపోయినా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనను రిఫరీ ఉల్లంఘించారంటూ ఫిర్యాదులో పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నక్వీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ‘‘మ్యాచ్ రిఫరీ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని (Code of Conduct), ఎంసీసీ నిబంధనలలోని క్రీడా స్ఫూర్తి నిబంధలను ఉల్లంఘించారు. అందుకే ఆండీ ప్రైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తక్షణమే తొలగించాలంటూ ఐసీసీని పీసీబీ డిమాండ్ చేసింది’’ అని అన్నారు.
సొంతవారిపైనే వేటు!
షేక్ హ్యాండ్ వివాదం నేపథ్యంలో సొంతవారిపైనే వేటు వేయడానికి పాకిస్థాన్ జట్టు వెనకాడటం లేదు. ఈ వివాదాన్ని సరైన రీతిలో హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యారంటూ పాకిస్థాన్ అంతర్జాతీయ క్రికెట్ డైరెక్టర్ ఉస్మాన్ వహ్లాను పీసీబీ సస్పెండ్ చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయనను పదవి నుంచి తొలగించారని ‘ఏస్పోర్ట్స్’ కథనం పేర్కొంది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తీరుపై అధికారికంగా ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగిందని, అందుకు ఉస్మాన్ వహ్లా బాధ్యత వహించాల్సి వచ్చిందని కథనం పేర్కొంది.
Also Read: MLA Yashaswini Reddy: తండా వాసుల కల నెరవేర్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
వివాదానికి నేపథ్యం
ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ముగిసిన అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో పాటు పాక్ ప్లేయర్లకు అభివాదం చేయకుండానే మైదానాన్ని వీడాడు. భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపలేదు. అంతకుముందు ఆసియా కప్ కు సంబంధించి నిర్వహించిన అధికారిక ప్రెస్ మీట్ లోనూ పాక్ కెప్టెన్ కు సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం గమనార్హం. మెుత్తంగా దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వద్ద అధికారిక ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అయితే భారత్ వైపు నుంచి ఇది తప్పు కాదని బీసీసీఐ స్పష్టం చేసింది.