Bangladesh-ICC: పొరుగుదేశం బంగ్లాదేశ్‌తో భారత్ దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. పరిస్థితులు ఉద్రిక్తతంగా మారిన నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టార్ క్రికెట్ ప్లేయర్, పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ తీసుకున్న నిర్ణయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఏమాత్రం సహించలేకపోతోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్-2026లో తమ మ్యాచ్ వేదికలను శ్రీలంకకు తరలించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఐసీసీకి (ICC) లేఖ కూడా రాసింది. అయితే, బీసీబీని అభ్యర్థనకు అంగీకరించే అవకాశం లేదని (Bangladesh-ICC) తెలుస్తోంది. ఆ విజ్ఞప్తిని తిరస్కరించాలని ఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు ఖరారైన వేదికలను భారత్‌లోనే వేరే మైదానాలకు షిప్ట్ చేస్తే సరిపోతుందని సూచించాలని యోచిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో స్పందించి ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
చెన్నై, కోల్‌కతాకు తరలింపు!
టీ20 వరల్డ్ కప్-2026 (T20 World cup) అధికారిక షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్ తన మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికలుగా ఆడాల్సి ఉంది. అయితే, ఈ రెండు వేదికలను చెన్నై, తిరువనంతపురం నగరాలను ప్రత్యామ్నాయ వేదికలుగా సూచించాలని ఐసీసీ భావిస్తోంది. అయితే, గతంలో చెన్నై నగరాన్ని ఒక ఆప్షన్‌గా ఇవ్వగా బంగ్లాదేశ్ తిరస్కరించింది. అందుకే, తమ ప్రభుత్వం అంగీకరించకపోవచ్చని బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం తెలిపారు. టీ20 వరల్డ్ కప్‌నకు సంబంధించి తాము ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం లేదనే తెలిసిందేనని అన్నారు. వేదికల విషయమై తాము ప్రభుత్వంతో చర్చిస్తామని, ప్రస్తుతానికైతే తమ ఆలోచనలో మార్పులేదని చెప్పారు.
Read Also- Swetcha Effect: స్వేచ్ఛ కథనానికి అదిరిపోయే రెస్పాన్స్.. పల్లె ప్రకృతి వనంలో మృత్యుపాశాలు తొలగింపు!
భద్రతపై ప్రకటన ఆశిస్తున్న బంగ్లాదేశ్
ప్రపంచకప్‌లో తమ జట్టు భద్రతపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో, భద్రత విషయమై భారత కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా అభయం ఇస్తూ సమాచారం ఇస్తే బాగుంటుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆశిస్తోంది. మరోవైపు, వడోదరలో ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ అంపైర్ షర్ఫుద్దౌలా సైకత్ అంపైరింగ్ నిర్వహించారు. వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆయనతో పాటు గాజీ సోహెల్ కూడా అంపైర్లుగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి, భద్రత విషయంలో ఎలాంటి ఢోకా ఉండబోదని, భద్రతా పరమైన సమస్యలకు సమాధానంగా అంపైర్ సైకత్‌ను ఉదాహరణను బీసీసీఐ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంపైర్లు సురక్షితంగా భారత్‌లో ఉంటున్నప్పుడు, జట్టు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రావొచ్చని సూచించే ఛాన్స్ ఉంది. మరోవైపు, టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే జట్లు ప్రాక్టీస్ ఆడనున్నాయి. ఈ తరుణంలో బంగ్లాదేశ్ డిమాండ్లు మొదలవ్వడంతో, వీలైనంత త్వరగా దీనికి చెక్ పెట్టాలని బీసీసీఐ వర్గాలు యోచిస్తున్నాయి.

