Veerabhadra Swamy Temple: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో వెలసిన పురాతన శైవ క్షేత్రమైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో మకర సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు జరుగుతున్న ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగునున్న జిల్లాల నుంచి కూడా లక్షలాది భక్తులు తరలి వస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి మహా కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ కల్యాణోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది
వీర బోనం ఊరేగింపు ఆకర్షణ
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన వీర బోనం ఊరేగింపు భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది భక్తులు వీర బోనం ఎత్తుకొని నృత్యాలు చేస్తూ, డప్పు చప్పుళ్ల నడుమ స్వామివారికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తి నాదాలతో మార్మోగిపోయాయి. ఎడ్లబండ్ల ప్రదర్శనకు తరలివచ్చిన జనసంద్రం మకర సంక్రాంతి రోజున సంప్రదాయంగా నిర్వహించే ఎడ్లబండ్ల ప్రదర్శన జాతరలో మరో ప్రధాన ఆకర్షణగా నిరుస్తుంది మేకలతో రథాలను తయారు చేసి, వందలాది ఎడ్లబండ్లను ఆకర్షణీయమైన లైటింగ్‌తో అలంకరించి ఆలయం చుట్టూ తిప్పుతారు.. ముందుగా కుమ్మరుల ఎడ్లబండ్లు తిరగగా, అనంతరం ఇతర బండ్లు ఊరేగింపుగా సాగుతాయి. ఈ దృశ్యాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిలకిస్తారు.
Also Read: Digital Payments: భక్తులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పురాతన చారిత్రక శైవ క్షేత్రం
కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయం కాకతీయుల కాలానికి చెందిన పురాతన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. క్రీ.శ. 1600 ప్రాంతంలో శ్రీ మల్లిఖార్జున పండితుని మనవడు కేదారి పండితుడు శైవాగమానుసారంగా స్వామివారిని ప్రతిష్టించినట్లు స్థల పురాణం చెబుతోంది. మొదట స్వామివారు కొండపై వెలిశారని, అనంతరం క్రింద ఆలయంలో ప్రతిష్టించబడినట్లు భక్తుల విశ్వాసం. ఆలయం చుట్టూ ఉన్న సప్తగుండాలు (ఏడు కోనేర్లు) ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయి. విశాల ఆలయ ప్రాంగణం, శిల్పకళా వైభవంతో కూడిన ప్రాకార మండపాలు, రాజగోపురాలు, ఈశాన్య భాగంలో పుష్కరిణి, కొండపై సప్తకోనేరులతో ఆలయం దర్శనమిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆధునిక వసతులు కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
అగ్నిగుండాలు భక్తుల అపార విశ్వాసం
జాతర ముగింపు రోజున జరిగే అగ్నిగుండాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమంగా భావిస్తారు. ఈ అగ్నిగుండాల్లో వందలాది భక్తులు నడిచి తమ మొక్కులు తీర్చుకుంటారు. అగ్నిగుండాల్లో నడిచిన వారికి సమస్త శరీర బాధలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ప్రత్యేక ఆచారాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు కూర మీసాలు, గుమ్మడికాయలు స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇలా సమర్పించిన వారికి స్వామివారి విశేష ఆశీస్సులు లభిస్తాయని అర్చకులు తెలిపారు. భద్రకాళి అమ్మవారి దర్శనంతో రోగ, రుణ బాధలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
భక్తుల కోసం ప్రత్యేక బస్సులు
కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. హనుమకొండ, వరంగల్, జనగాం, సిద్ధిపేట, హుస్నాబాద్ తదితర ప్రాంతాల నుంచి కొత్తకొండకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైతే అదనపు బస్సులు కూడా నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
భద్రతకు పటిష్ట ఏర్పాట్లు
కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు, జాతర మార్గాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా కొనసాగుతోంది. భక్తుల భద్రత కోసం సుమారు 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణ అధికారి కిషన్ రావు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన సౌకర్యాలు, భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తంగా కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా కొనసాగుతుండగా, ఉత్సవాల ముగింపు వరకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: Hanumakonda Collector: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించండి: కలెక్టర్ స్నేహ శబరీష్

