Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై గత కొంత కాలంలో కొన్ని ప్రైవేట్ సంస్థలు, సర్వే సంస్థలతో పాటు కాంగ్రెస్ పార్టీ సొంతంగా నిర్వహించిన సర్వే రిపోర్టులను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అందజేశారు. ఆ సర్వే ల ఆధారంగానే అభ్యర్ధి ప్రకటన ఉండనున్నది. ఈ సర్వే రిపోర్టులన్నీ సీఎం పరిశీలన అనంతరం ఏఐసీసీ(AICC)కి పంపనున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో స్టడీ తర్వాత క్యాండిడేట్ ఫిల్టర్ జరగనున్నది. అయితే కోడ్ వచ్చిన తర్వాత నే అభ్యర్ధిని ప్రకటించే ఛాన్స్ ఉన్నది. అప్పటి వరకు అభ్యర్ధి ఎవరనేది తెలియకుండా పార్టీ జాగ్రత్తలు పడనున్నది. మరోవైపు ఈ నెలాఖరు లోపే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. అంటే అక్టోబరులోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. బీహార్(Bihar) తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకే సారి జరిగే అవకాశం ఉంటుందని పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్ చార్జీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్ లతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లతో రివ్యూ నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిలు సైతం ఉన్నారు.
అభ్యర్ధి ఎవరైనా గెలిపించాల్సిందే…?
అభ్యర్ధి ఎంపికపై తుది నిర్ణయం ఏఐసీసీ ప్రెసిడెండ్ ఖర్గేతో పాటు అగ్రనేతలకు వదిలేద్దామని సీఎం చెప్పినట్లు సమాచారం. సర్వేలు, పార్టీ పరిస్థితుల నివేదికలు ఢిల్లీకి పంపనున్నట్లు తెలిసింది. ఇక ఈ నెల 21 వరకు ఒక్కో బూత్ లో పది మంది చొప్పున వెంటనే కమిటీ నియమించాలని సీఎం సూచించారు. డివిజన్ అధ్యక్షులకు బాధ్యతలు ఇవ్వాలని కోరారు. ఇక జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నిక ను గెలిపించాల్సిన బాధ్యత కార్పొరేషన్ చైర్మన్లకు అప్పగించారు. తప్పనిసరిగా గెలిపించాల్సిందేనంటూ నొక్కి చెప్పారు. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారుతుందని, అందుకే నేతలంతా సమన్వయంగా సీరియస్ గా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం ఆదేశించారు.
Also Read: Anuparna Roy: గురువు మాట కూడా లెక్కచేయని వెనీస్ అవార్డు గ్రహీత.. ఎందుకంటే?
వాళ్లంతా కీలకం..?
ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు లక్షా 17 వేల ముస్లీం ఓటర్లు, 40 వేల కమ్మ, 40 వేలు క్రిస్టియన్, మైనార్టీ, 13 నుంచి 14 వేలు రెడ్డి సామాజిక వర్గం, 25 నుంచి 30 వేలు బీసీ లు ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారస్తులు అత్యధికంగా ఉండటంతో వాళ్లంతా ఓటర్లపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందని పార్టీ అంచనా వేసింది. పరిశ్రమలు, కంపెనీలు, కార్యాలయాల్లో పనిచేసే వారిని మోటివేట్ చేయవచ్చనే అభిప్రాయంతో పార్టీ ఉన్నది. దీంతోనే కమ్మ సామాజిక వర్గాన్ని కీలక వ్యక్తులు, లీడర్లు, వ్యాపారస్తులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కో ఆర్డినేట్ చేస్తున్నారు. ఆయా కీలక లీడర్లలో ఒక్కొక్కరు సుమారు 50 నుంచి వంద ఓట్లు వేయించేలా ప్లాన్ అమలు చేస్తున్నారు.
ఆ ముగ్గురు విశ్వ ప్రయత్నాలు…
ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక టిక్కెట్ కోసం నవీన్ యాదవ్(Naveen Yadav), బొంతు రామ్మోహన్(Bonthu Rammohan), అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) లు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ గెలుపు నకు ఏకంగా ముగ్గురు మంత్రులు, 20 మంది కార్పొరేషన్ చైర్మన్లు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అక్టోబరు చివరి నాటికి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ స్పీడప్ అయ్యాయి.
కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ డెవలప్..సీఎం రేవంత్ రెడ్డి
‘‘జూబ్లీ హిల్స్ గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి. పోలింగ్ బూత్ ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా క్షేత్రస్థాయిలో కల్పించాలి.కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలు అవగాహన చేసుకునేలా ప్రోగ్రామ్స్ చేయాలి. పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉన్నది. పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా.” అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read: Local Body Elections: తెలంగాణలో స్థానిక సమరంపై అనుమానాలు!.. ఎందుకంటే?