BRS KTR on Congress: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్(BRS) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR) మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఆర్థిక దుష్ప్రచారానికి పాల్పడుతుందని, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఇతర మంత్రులు రాష్ట్రం ప్రతి నెలా రూ.7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాగ్(Cag) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని స్పష్టం చేశారు. వాస్తవానికి గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ.2,300 కోట్లు మాత్రమేనని (4 నెలల్లో రూ.9,355 కోట్లు) పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర రుణ భారాన్ని ఎక్కువ చేసి చూపిస్తుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు.
Also Read: Sand Mining Scam: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు
ప్రాజెక్టులపై సమీక్షలు
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రజా జీవనం స్తంభించిందన్నారు. ఈ వర్షాలతో ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని, ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, విలాసవంతమైన, లాభదాయకమైన ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రూ.3,50,000 కోట్లతో 2036 ఒలింపిక్స్ నిర్వహణ, రూ. 1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ, రూ. 225 కోట్ల హైదరాబాద్(Hyderabad) బీచ్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు. ప్రజల గోడును గాలికొదిలేసి, డబ్బు సంపాదించే పనులపైనే రేవంత్ అండ్ కో దృష్టి పెట్టిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని, ఇది ప్రజా పాలన కాదని మండిపడ్డారు.
Also Read: Virender Sehwag: ఆ ముగ్గురు గేమ్ ఛేంజర్లు.. టీమిండియాపై సెహ్వాగ్ తొలి స్పందన
