BJP party: రాష్ట్రంలో త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలకు బీజేపీ(BJP) సమాయత్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టడంపై కసరత్తును కాషాయ పార్టీ ముమ్మరం చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ లో ఐటీ(IT), సోషల్ మీడియా(Social Media) విభాగాలతో వర్క్ షాప్ నిర్వహించింది. ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ పనితీరు విధానాలపై రాష్ట్ర నాయకత్వం అవగాహన కల్పించింది. ఈమేరకు రాష్ట్ర నాయకత్వం సోషల్ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అడ్డమైన రాతలు రాయొద్దని స్పష్టంచేసింది. పార్టీలోని నేతలపై వ్యతిరేకంగా పోస్టులు పెట్టి నేతల మధ్య విభేదాలకు కారణమవ్వొద్దని రాష్ట్ర నాయకత్వం స్పష్టంచేసింది.
పదునున్న కత్తిలాంటిది
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని రాష్ట్ర నాయకత్వం కొనియాడింది. అదే సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా, చేయించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని, ఎవరైనా ఉపేక్షించేది లేదని కరాఖండిగా తేల్చేసింది. పార్టీపై అడ్డమైన రాతలు రాసినా, నేతల మధ్య గ్యాప్ తేవాలని చూసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సస్పెన్షన్ తో పాటు టర్మినేషన్ ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. థంబ్ నెయిల్ తో పార్టీపై మిస్ ఇన్ఫర్మేషన్ వచ్చేలా చేస్తున్నారని ఐటీ, సోషల్ మీడియా విభాగానికి సూచించారు. వ్యక్తిగత ఎదుగుదలకు సోషల్ మీడియాలో పార్టీ కి నష్టం కలిగించేలా చేస్తే ఇబ్బందులు తప్పవని రాష్ట్ర నాయకత్వం స్పష్టంచేసింది.
కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో మీడియా, సోషల్ మీడియాలో పార్టీ కోసం ప్రచారం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలని పార్టీ ఆదేశించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టిసారించాలని నిర్ణయించింది. 11 ఏండ్లలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులు, పథకాల వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 8 శాతం ట్యాక్స్ డివల్యూషన్ ఫండ్(Tax Devolution Fund) ఇస్తున్నట్లు నాయకులు వారికి దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తున్న అంశాన్ని వివరించాలని దిశానిర్దేశం చేశారు. సర్పంచ్ లకు పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు నిధులు నిలిచిపోవడం వంటి అంశాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంపై దృష్టిసారించాలని దిశానిర్దేశం చేశారు.
Also Read: Smart Parking System: స్మార్ట్ పార్కింగ్ ప్రతిపాదన తిరస్కరణ.. అద్దె వేలానికి లైన్ క్లియర్!
లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకుంటే నిధులు రావు : రాంచందర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసిందని, ఇప్పటికైనా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకుంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిచిపోతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ram Chender Rao) తెలిపారు. అప్పు చేసి పనులు చేపట్టిన సర్పంచ్ లకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని విమర్శలు చేశారు. స్థానిక సంస్థల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ కు ఏమాత్రం రెస్పెక్ట్ లేదని మండిపడ్డారు. ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామని భయపడుతున్నారని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కావాలనే దుష్ప్రచారం చేయించి.. యూరియాపై కృత్రిమ కొరత సృష్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపోతే పార్టీ కి వ్యతిరేకంగా పనిచేసినా, చేయించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని రాంచందర్ రావు హెచ్చరించారు. సస్పెన్ణషన్ వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఐటీ(IT), సోషల్ మీడియా విభాగాలపై ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు.
నేడు నిజామాబాద్ జిల్లాకు స్టేట్ చీఫ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కార్యకర్తల సమ్మేళనానికి ఆయన హాజరవుతారు. ఆపై నూతనంగా నియామకమైన జిల్లా పదాధికారుల సమావేశానికి హాజరై త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read: Kantara Chapter 1: ‘కాంతార చాప్తర్ 1’ థియేట్రికల్ హక్కులు ఎంతో తెలిస్తే షాక్..!