Unauthorised Cables: ఇంటర్నెట్, కేబుల్ టీవీ కంపెనీలు విద్యుత్ స్తంభాలపై అనధికార కేబుళ్లను ఏర్పాటుచేస్తున్నాయని ఎస్పీడీసీఎల్(SPDCL) అధికారులు చెబుతున్నారు. ఈ కంపెనీలు ఆప్టికల్ ఫైబర్ కేబుల్, కో-యాక్సిల్ కేబుల్ (లోపల మెటల్ కండక్టర్‌తో ఇన్సులేషన్ ఉన్న కేబుల్ టీవీ వైర్) ఉన్న కేబుల్స్ వాడుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్(Hyderabad)లో దాదాపు 20 లక్షల విద్యుత్ స్తంభాలు(ఎల్టీ, 11 కేవీ, 33 కేవీ) ఉన్నట్లుగా చెబుతున్నారు. వాటిలో కేవలం 1.73 లక్షల స్తంభాల వినియోగానికి మాత్రమే ఇంటర్నెట్, కేబుల్ కంపెనీలు అనుమతి తీసుకున్నాయని తెలిపారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
విద్యుత్ స్తంభాలపై బ్యాక్ హాల్ ఎక్విప్‌మెంట్
వివిధ షరతులతో వారికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను విద్యుత్ స్తంభాలపై వేయడం, భద్రతా చర్యలను అమలు చేయడం ఏజెన్సీ బాధ్యత అని, ఆప్టికల్ ఫైబర్ కేబుల్(Fiber cable) వేయబడిన విద్యుత్ స్తంభాలను సులభంగా గుర్తించేందుకు వాటిపై రంగు గుర్తింపు(పెయింటింగ్) తప్పనిసరిగా చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాల(Electric poles)పై బ్యాక్ హాల్ ఎక్విప్‌మెంట్ వంటి అదనపు పరికరాలను ఇన్‌స్టాల్ చేయకూడదన్నారు. అనుమతించిన సంఖ్యకు మించి స్తంభాలను ఉపయోగించకూడదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
కేబుళ్లను తొలగించట్లేదు
సమీపంలోని లైన్ల నుంచి విద్యుత్ సరఫరాను డైరెక్ట్ ట్యాపింగ్ చేయరాదని స్పష్టంచేశారు. కానీ, అనేక ప్రదేశాల్లో కేబుల్స్ కిందికి 5 అడుగుల ఎత్తులో వదులుగా వేస్తున్నారని, దీంతో కాంక్రీట్ మిక్సర్ వాహనాలు, బోర్ డ్రిల్లింగ్ వాహనాలు వంటి భారీ వాహనాలు దాటే సమయంలో విద్యుత్ లైన్‌కు తగిలి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తద్వారా విద్యుత్ నెట్‌వర్క్‌కు కూడా భారీ నష్టం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఐఎస్పీ, కేబుల్ ఆపరేటర్లు కొత్త కనెక్షన్ కోసం కేబుల్ వేస్తున్నారని, కానీ ఉపయోగించని, పనిచేయని కేబుళ్లను తొలగించట్లేదని పేర్కొన్నారు.
సాధారణ ప్రజలకు ప్రమాదకరంగా
ఉపయోగించని కేబుల్ గుండ్లు విద్యుత్ స్తంభాలపై 3 నుంచి 4 అడుగుల ఎత్తులో వదిలేస్తున్నారని వాపోయారు. ఈ ఉపయోగించని కేబుళ్లను గుర్తించడం కష్టతరమైనదని, ఇవి సాధారణ ప్రజలకు, సిబ్బందికి ప్రమాదకరంగా మారుతున్నాయని వెల్లడించారు. అనేక సందర్భాల్లో సిబ్బంది కేబుల్ బండిల్స్‌లో చిక్కుకుని స్తంభం నుంచి పడిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని వాపోయారు. కేబుల్ బండిల్స్ కు తోడు ఇతర బాక్సులు, సిలిండర్ ఆకారపు పరికరాలు ఇష్టానుసారంగా వేలాడ తీయడం వలన స్తంభాలు కూడా వంగిపోతున్నాయని పేర్కొన్నారు.
ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలి
అనుమతి తీసుకున్న వారు, తీసుకోని వారు అందరూ ఒకే రకమైన నలుపు రంగు కేబుల్స్‌ను ఉపయోగిస్తున్నందున, ఆపరేటర్‌ను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనుమతి పొందిన, వాడకంలో ఉన్న కేబుల్స్‌ను సులభంగా గుర్తించడానికి పెయింట్ చేయాలని లేదా ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలని ఇప్పటికే సూచించినట్లు చెప్పారు. కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ సంప్రదించుకుని అనధికారంగా ఏర్పాటుచేసిన కేబుళ్లను తొలగించమని గతేడాది జూలై నుంచి దాదాపు ఆరు సార్లు 32 ఆపరేటర్లతో పలు సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల భద్రతా దృష్ట్యా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో కేబుల్ కటింగ్ ప్రక్రియ షురూ చేసినట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.
Also Read: Khammam District: ఖమ్మం జిల్లాలో మంత్రి పీఏ ఆగడాలు.. ప్రజలు ఇబ్బందులు