Women Harassment: నెలసరి (పీరియడ్స్) అనేది మహిళల జీవితంలో అత్యంత వ్యక్తిగతమైన, గోప్యమైన విషయం. బయటకు చెప్పుకోలేనంత నొప్పి, రక్తస్రావం, వాటితో ముడిపడివున్న ఇబ్బందులు మహిళలకు మాత్రమే అర్థమవుతాయి. వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన ఈ సమస్యపై బహిరంగంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కనీస అవగాహన ఉన్న ఎవరికైనా ఈ విషయంలో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. కానీ, ఓ యూనివర్సిటీలో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం ఈ కనీస జ్ఞానం లేకుండాపోయింది. అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. హర్యానాలోని రోహ్‌తక్‌లో ఉన్న మహర్షి దయానంద్ యూనివర్సిటీలో పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులు తాము నెలసరిలో ఉన్నట్టుగా నిరూపించుకోవడానికి ప్రైవేటు శరీర భాగాలను ఫొటో తీసి పంపాలంటూ వారి సూపర్‌వైజర్ ఒత్తిడి చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దుస్తులు తీసేసి ఫొటోలు పంపాలంటూ ముగ్గుర్ని ఒత్తిడి చేసినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై (Women Harassment) తీవ్ర దుమారం చెలరేగింది.
నెలసరి కారణంగా అక్టోబర్ 26న మహిళాలు కాస్త నెమ్మదిగా పనిచేస్తున్న సమయంలో, వారి సూపర్‌వైజర్లు ఈ విధంగా అమానీయంగా ప్రవర్తించారు. ఈ వ్యవహారం యూనివర్సిటీలో తీవ్ర నిరసన ప్రదర్శనలకు దారితీసింది. ఈ షాకింగ్ విషయంలో వర్సిటీలోని మిగతా మహిళా సిబ్బంది, స్టూడెంట్స్, విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కు కూడా ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంపించారు. ఒక ప్రొఫెసర్ అక్కడికి చేరుకునే వరకు నిరసన కొనసాగింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై చర్యలు తీసుకుంటామంటూ డాక్టర్ భగత్ సింగ్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు.
Read Also- EAD Policy: భారతీయులను ఇబ్బందిపెట్టేలా ట్రంప్ మరో నిర్ణయం.. అమెరికాలో ఉన్న మనోళ్ల ఉద్యోగాలకు ముప్పు!
ఈ తతంగంపై వర్సిటీ రిజిస్ట్రార్ కేకే గుప్తా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నట్టు, ఇప్పటికే ఒకర్ని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. ఘటనపై సంపూర్ణంగా విచారణ చేపట్టి, తప్పు చేసినవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అవసరమైతే, నిందితులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు కూడా పెడతామని తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు సూపర్‌వైజర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదయింది. లైంగిక వేధింపులు, దుస్తులు విప్పించేందుకు ప్రయత్నం, మహిళల గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో దాడి, నేరపూరిత బెదిరింపు వంటి సెక్షన్ల కింద, బీఎన్ఎస్ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసు ఆఫీసర్ రోషన్ లాల్ వెల్లడించారు.
అసలు వివాదం ఎలా మొదలైంది?
ఈ వ్యవహారంపై బాధితులు మీడియాకు కొన్ని వివరాలు వెల్లడించారు. తాము సెలవులు తీసుకోవడంపై సూపర్‌వైజర్లు వినోద్, వితేంద్ర ప్రశ్నించడంతో ఈ సమస్య మొదలైందని వెల్లడించారు. తాము నెలసరిలో ఉన్నామని, ఒంట్లో బాగోలేదని, తోటి పారిశుద్ధ్య కార్మికుల్లో సీనియర్లు కూడా తమకు అనుమతి ఇచ్చారని చెప్పినా సూపర్‌వైజర్లు కర్కశంగా వ్యవహరించారని చెప్పారు. నెలసరి ఉన్నట్టుగా నిరూపించడానికి దుస్తులు తీయాలని అడిగారని వారు వాపోయాడు. తమను బాత్‌రూమ్‌కి తీసుకెళ్లి, నెలసరి ఉన్నట్టుగా శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయో లేవో ఫొటోలు తమకు తీసిపెట్టాలంటూ ఒక మహిళా ఉద్యోగిని పిలిచి వినోద్, జితేంద్ర ఆదేశించారని పేర్కొన్నారు. ఇందుకు అంగీకరించకపోవడంతో తమను బూతులు తిట్టారని, ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ బెదిరించారని బాధిత మహిళలు వివరించారు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				