SC on Stray dogs: వీధి కుక్కలకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) మరోమారు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కుక్క కాట్ల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ తదితర ప్రదేశాల చుట్టూ కుక్కలు ప్రవేశించకుండా కంచెలు వేయాలని తీర్పు వెలువరించింది. ఆయా ప్రదేశాల్లోకి వీధి కుక్కలు ప్రవేశించకుండా చూడటం స్థానిక స్వపరిపాలనా సంస్థల బాధ్యత అని స్పష్టం చేసింది.
‘అలా చేస్తే లక్ష్యం నెరవేరదు’
వీధి కుక్కలపై సుమోటోగా తీసుకున్న కేసుపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ జనసంచారం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వీధికుక్కలను గుర్తించి స్టెరిలైజేషన్ చేసి, రీలోకేషన్ కూడా చేయాలని దిశానిర్దేశం చేసింది. ఒక దగ్గర పట్టుకున్న కుక్కలను స్టెరిలైజేషన్ తర్వాత తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టడానికి వీల్లేదని పేర్కొంది. అలా చేస్తే ఆ ప్రాంతాలను వీధి కుక్కల నుంచి విముక్తి కలిగించాలన్న లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడింది.
‘ఆ బాధ్యత స్థానిక అధికారులదే’
వీధి కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు స్థానిక సంస్థలు తనిఖీలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. శునకాలు స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోకుండా చూసే బాధ్యత స్థానిక అధికారులదేనని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం.. సీనియర్ అడ్వకేట్లు ఆనంద్ గ్రోవర్, కరుణా నండి తదితరులు తమ అభిప్రాయాలను వినిపించే ప్రయత్నం చేశారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని త్రిసభ్య ధర్మాసనానికి సూచించారు. వీధి శునకాలను తరలించినా.. మళ్లీ కొత్త కుక్కలు వచ్చి ఆ ప్రాంతాల్లో స్థిరపడతాయని అడ్వకేట్లు పేర్కొన్నారు. అయితే వారి వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు.
Also Read: Maganti Family Dispute: మాగంటి అసలైన వారసుడ్ని నేనే.. నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ప్రద్యుమ్న తారక్
రహదారులపై పశువులు తిరగకుండా..
రహదారులపై కుక్కలు ఎద్దులు, బర్రెలు, మేకలు, ఇతర జంతువుల సంచారానికి సంబంధించి కూడా ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రహదారులు, హైవేలు, ఎక్స్ ప్రెస్ వేలు తదితర మార్గాల్లో పశువులు రాకుండా నియంత్రణా చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయస్థానం సమర్థించింది. ఆయా జంతువులను గోశాలలు లేదా ఆశ్రయ కేంద్రాలకు తరలించాలని దిశానిర్దేశం చేసింది. ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని పేర్కొంది. లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు ఆయా అధికారులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఆదేశాల అమలుకు తీసుకున్న నిర్ణయాలపై 8 వారాల్లోగా నివేదిక సమర్పించాలు సుప్రీంకోర్టు ఆదేశించింది.
