Pakistani womens: కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని పాకిస్థాన్ పౌరులు (Pakisthan Citizens) వెంటనే వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం (Indian Govt) ఆదేశించింది. వారికి దాడి జరిగిన తర్వాతి రోజు నుంచి నాలుగు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. దీంతో ఇక్కడి వారిని పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ మహిళలు (Pakistani womens), పురుషులు తమ జీవిత భాగస్వాములను వదిలేసి.. వాఘా సరిహద్దు (Wagah Border) వద్ద పాకిస్తాన్ లోకి వెళ్లిపోతున్నారు. అయితే ఇన్నాళ్లు కలిసి ఉన్న జీవిత భాగస్వామిని వీడి వెళ్లిపోతుండటంతో భారత్ కు చెందిన పురుషులు, స్త్రీలు ఇండో – పాక్ సరిహద్దు వద్ద తల్లడిల్లిపోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
భారత్ – పాకిస్థాన్ మధ్య ఉన్న అధికారిక సరిహద్దు ప్రాంతం.. వాఘా బోర్డర్ ప్రస్తుతం రద్దీగా మారింది. భారత్ లో ఉంటున్న పాక్ పౌరులు తరలిపోతుండటంతో వాఘా బోర్డర్ వద్ద రద్దీ ఏర్పడింది. దయాది దేశం నుంచి వచ్చి భారత్ లో సెటిల్ అయిన పలువురు పాక్ పౌరులు.. భారత్ లోని మహిళలను పెళ్లాడారు. ఇక్కడే కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. అయితే వారికి ఎలాంటి భారత పౌరసత్వం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు వారు తప్పనిసరిగా భారత్ ను వీడి వెళ్లక తప్పడం లేదు. గడిచిన 48 గంటల్లో 287 మంది పాకిస్థాన్ పౌరులు.. భారత్ ను వీడిచి తమ దేశానికి వెళ్లిపోయారు. అయితే వారిని పెళ్లాడిన భారతీయ మహిళలు.. కన్నీటి పర్యంతమవుతున్నారు.
పాక్ మహిళలు సైతం..
గతంలో వచ్చి.. కాశ్మీర్ సరిహద్దుల్లోని భారత పురుషులను పెళ్లాడిన పాక్ మహిళలు సైతం తమ దేశానికి వెళ్లక తప్పడం లేదు. అయితే తమ భర్తలను విడిచి తాము వెళ్లలేమని వాఘా సరిహద్దు వద్ద వారు నిరసన తెలియజేస్తున్నారు. కన్నీటి పర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడే ఉంటే భారత ప్రభుత్వ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని తెలిసి.. తప్పక వెళ్లిపోతున్నారు. మరోవైపు పాక్ లో ఉన్న పలువురు భారతీయులు సైతం ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నారు. గత 48 గంటల్లో 191 మంది ఇండియన్స్.. భారత్ కు తిరిగి వచ్చేసినట్లు బోర్డర్ అధికారులు తెలియజేశారు.
Also Read: Chinna Jeeyar Swami: నెక్ట్స్ టార్గెట్ చిన్న జీయర్ స్వామి? చిలుకూరు పూజారి సంచలన నిజాలు
హైదరాబాద్ వారికీ వార్నింగ్
హైదరాబాద్ లో కుటుంబాలను ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న పాక్ పౌరులు సైతం ప్రభుత్వ ఆదేశాలతో తమ దేశం బాటపట్టారు. షార్ట్ టర్మ్ వీసా ద్వారా వచ్చి నగరంలో సెటిల్ అయిన నలుగురికి తాజాగా హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా దేశం దాటి వెళ్లిపోవాలని ఆదేశించారు. హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ లో కలిపి 213 మంది పాకిస్తానీలు ఉన్నారు.