Bharat Summit 2025: హైదరాబాద్ హెచ్ఐసీసీ (HICC) జరుగుతున్న భారత్ సమ్మిట్ – 2025 రెండో కార్యక్రమానికి కాంగెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజరయ్యారు. రాహుల్ తో పాటు వేదికను పంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సభను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతలు, లక్ష్యాల గురించి సీఎం మాట్లాడారు.
ఆంక్షలు నేరవేర్చడమే లక్ష్యం
సమాజంలో ప్రతీ ఒక్కరి ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని భారత్ సమ్మిట్ – 2025 రెండో రోజు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. మహిళలు రైతుల్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. అలాగే నిరుద్యోగుల కోసం ప్రత్యేక స్కీమ్స్ ప్రవేశపెట్టినట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవల తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం అమలు విషయాన్ని ప్రస్తావించారు. అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలియజేశారు.
అతిపెద్ద రుణమాఫీ
తెలంగాణకు ఎంతో గొప్ప చరిత్రతో పాటు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని సీఎం రేవంత్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా గత పదేళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని పేర్కొన్నారు. తమ ఆకాంక్షల సాధన కోసం ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలను తాము ప్రారంభించినట్లు రేవంత్ రెడ్డి అన్నారు. 15 ఆగస్టు 2024 న రూ.20,617 కోట్లు చెల్లించి.. 25లక్షల 50 వేల మంది రైతులను పూర్తిగా రుణ విముక్తులను చేసినట్లు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలంగాణ రైతాంగానికి అప్పుల నుంచి విముక్తి లభించింది. భారతదేశంలోనే ఇది అతిపెద్ద రుణమాఫీ అని సీఎం అన్నారు.
Also Read: Dharmapuri Arvind On KCR: కేసీఆర్ ఫ్యామిలీని ఏకిపారేసిన బీజేపీ ఎంపీ.. మరీ ఇంత ఘోరంగానా!
ఏటా రూ.20,000 కోట్లు
అలాగే తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. రైతుభరోసా పేరుతో ఎకరాకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. భూమిలేని రైతు కూలీలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.12,000 సాయం అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో భూమిలేని, భూమి కలిగిన రైతులకు కలిపి ఏటా రూ.20,000 కోట్లకు పైగా నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. రైతుల పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుబీమా, పంటల బీమాలతో రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు.
ఏడాదిలో 60వేల ఉద్యోగాలు
అధికారం చేపట్టిన చేపట్టిన తొలి ఏడాదిలోనే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 5 లక్షల మంది యువతకు ప్రయోజనం కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించుకున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం రేవంత్ అన్నారు. ప్రైవేటు రంగంలో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు రూ.2.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
తెలంగాణలో 67 లక్షల మంది స్వయం సహాయక సభ్యులు ఉన్నారని సీఎం రేవంత్ అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చూడాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సోలార్ పవర్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులకు మహిళలను యజమానులను చేసినట్లు చెప్పారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు.. వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు మహిళా సౌర విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. కార్పొరేట్ రవాణా సంస్థలతో పోటీ పడుతూ మహిళలు 600 బస్సులను నడుపుతున్నారు.
రూ. 500 లకే గ్యాస్ సిలిండర్
ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మహిళను ఇంటి యజమానిని చేయాలని సంకల్పించినట్లు రేవంత్ రెడ్డి అన్నారు. తొలి ఏడాదిలో 4,50,000 కుటుంబాలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.22 వేల కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు పథకం కోసం 15 నెలల్లో రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తునట్లు గుర్తుచేశారు.