Pakistan-saudi-Arabia
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Pak Saudi Pact: సౌదీతో పాక్ రక్షణ ఒప్పందం.. భారత్‌తో యుద్ధం వస్తే కలిసి వస్తాయా?

Pak Saudi Pact: దాయాది దేశం పాకిస్థాన్, గల్ఫ్‌లో అత్యంత ముఖ్యమైన దేశం సౌదీఅరేబియా మధ్య బుధవారం అత్యంత కీలకమైన రక్షణ ఒప్పందం (Pak Saudi Pact) కుదిరింది. ‘స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్’ పేరిట కుదిరిన ఈ ఒప్పందంలో ప్రస్తావించిన ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. ‘‘ఈ రెండు దేశాల్లో ఏ ఒక్క దానిమీద దాడి జరిగినా.. ఇరు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించబడుతుంది’’ అని అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు. ఒప్పందంలో ఏ దేశం పేరునూ ప్రత్యేకంగా పేర్కొనకపోయినప్పటికీ.. ఒకవేళ భారత్‌–పాకిస్థాన్ మధ్య సంఘర్షణ జరిగి, పాక్ బలహీన స్థితిలో ఉంటే, సౌదీ అరేబియా రాయల్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగి భారత్ సేనలపై పోరాడుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సౌదీ తన ఎఫ్-15, యూరోఫైటర్ టైఫూన్‌ విమానాలను పాకిస్థాన్‌కు మద్దతుగా పంపిస్తుందా? అన్న అనుమానాలు ఒప్పందం కారణంగా కలుగుతున్నాయి.

అన్ని యుద్ధాల్లో సౌదీ అరేబియా నుంచి మద్దతు ఉంటుందని పాకిస్థాన్ కలలు కంటున్నప్పటికీ, నిపుణుల అభిప్రాయాలు మాత్రం మరో విధంగా ఉంది. అసలు ఈ ఒప్పందం భారత్‌ను ఉద్దేశించినది కాదని, ఇజ్రాయెల్‌ వంటి దేశాలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న చర్య కావొచ్చని అంతర్జాతీయ రక్షణరంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలైన యుద్ధ పరిస్థితులు ఏర్పడితే, సౌదీ అరేబియా ప్రాధాన్యతల దృష్ట్యా పాకిస్థాన్ ఆశలు నెరవేరడం అంత సులభం కాదని అంటున్నారు. కానీ, సౌదీఅరేబియాతో ఒప్పందం ద్వారా పెద్ద దౌత్య విజయం సాధించినట్టుగా పాకిస్థాన్ భావిస్తోంది. భారత్‌ను కట్టడి చేసేందుకు వ్యూహాత్మక చర్యగా చూస్తోంది.

Read Also- Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. రంగంలోకి డీసీహెచ్‌ఎస్.. వైద్యుల పనితీరుపై చర్యలు

రాజకీయ ఎత్తుగడ!

సౌదీ–పాకిస్థాన్ ఒప్పందం వాస్తవిక రక్షణ ఒప్పందం కంటే, రాజకీయ ప్రదర్శన (posturing) మాదిరిగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నదికాదని, బహుశా ఇజ్రాయెల్ వంటి ఇతర దేశాలతో అంతర్గత రాజకీయ వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని కుదుర్చుకున్న ఒప్పందం కావొచ్చని భావిస్తున్నారు. మిడిల్ ఈస్ట్‌లో చాలాకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, మరోవైపు యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారుల నుంచి సౌదీకి ముప్పు పొంచివున్న పరిస్థితుల్లో ఈ ఒప్పందం జరిగిందని అంటున్నారు. హౌతీలు తరచుగా సౌదీపై క్షిపణి దాడులు చేస్తున్నారని గుర్తుచేస్తున్నారు. ఎటుచూసినా ఈ ఒప్పందంతో పాకిస్థాన్‌కు పెద్దగా ఒనగూరేది ఏమీ ఉండదని చెబుతున్నారు.

భారత్-పాకిస్థాన్ మధ్య ఇప్పటివరకు 4 యుద్ధాలు జరిగాయి. మరో మూడు తీవ్రమైన సైనిక సంఘర్షణలు జరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాతే సౌదీ అరేబియా ఒప్పందం కుదుర్చుకుందని, మరోసారి భారత్–పాక్ మధ్య ఘర్షణ జరిగితే సౌదీ కీలక పాత్ర పోషిస్తుందనేది దీనిర్థం కాదని రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్, విశ్లేషకుడు క్రిస్టోఫర్ క్లారీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ ఒప్పందం ద్వారా పాకిస్థాన్‌కు భారత్‌పై పోరాటంలో సౌదీ సాయం గ్యారంటీ కాదని అన్నారు.

Read Also- Bhatti Vikramarka: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గిరిజన బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

భారత్‌పై ప్రభావం పరిమితం!

పాకిస్థాన్–సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం వినడానికి కీలకంగా అనిపించవచ్చు. కానీ, భారత్‌పై ప్రభావం పరిమితంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌తో సౌదీఅరేబియా యుద్ధానికి దిగుతుందనేది పగటి కలేనని నిపుణులు, భౌగోళిక రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఒప్పందం ప్రకటన సమయం, నేపథ్యాన్ని వేరుగా చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు. పాక్ ఒప్పందం కుదిరిన వెంటనే, భారత్ అపార్థం చేసుకోకుండా సౌదీఅరేబియా కీలక ప్రకటన కూడా చేసింది. ‘‘పాక్‌తో ఒప్పడం ఏ ప్రత్యేక దేశం, లేదా సంఘటనకు ప్రతిస్పందన కాదు. భారత్‌తో మా సంబంధాలు చాలా మెరుగైన స్థాయిలో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా బలోపేతం చేస్తాం. ప్రాంతీయంగా శాంతి నెలకొల్పే దిశగా మేము కొనసాగుతాం’’ అని సౌదీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. దీనిని బట్టి భారత్‌కు సౌదీ ఎంత ప్రాధాన్యత ఇవ్వనుందో స్పష్టమవుతోంది. కాగా, భారత్–సౌదీఅరేబియా మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. భారత్‌కు 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి సౌదీ కొనసాగుతోంది. ఇక, సౌదీకి భారత్ రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంవత్సరం 2024-25లో ఏకంగా 41.88 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది.

Just In

01

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?