Kashmir Issue: భారత్‌తో శాంతి, ద్వైపాక్షిక చర్చలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సమస్యకు (Kashmir Issue) పరిష్కారం లభించకుండా ఈ ప్రాంతంలో శాంతి నెలకొనదని, భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు సాధ్యంకాదని అన్నారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు ఇండియా ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. భారతదేశం, పాకిస్థాన్ పొరుగుదేశాలని, కలిసి జీవించడం నేర్చుకోవాలని హితబోధ చేశారు. అయితే, కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించకపోతే మాత్రం, సంబంధాలు సాధారణ స్థితికి చేరబోవని, కాశ్మీరీల రక్తం వృథాగా పోదని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. లండన్‌లో ప్రవాస పాకిస్థానీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాశ్మీర్ అంశంతో పాటు గాజా యుద్ధంపై కూడా ఆయన మాట్లాడారు.
Read Also- Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ టీమ్‌తో జత కలిసిన అనూహ్య వ్యక్తి.. నవ్వుకుంటున్న ఇండియన్స్
కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపకుండా భారత్–పాకిస్థాన్ సంబంధాలు ఏర్పడతాయని ఎవరైనా అనుకుంటే, వాళ్లు మూర్ఖుల స్వర్గధామంలో జీవిస్తున్నట్లే అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే మేము 4 యుద్ధాలు చేశాం. వాటికి బిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి. ఆ డబ్బును పాకిస్థాన్ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఉపయోగించాల్సింది’’ షెహబాజ్ వ్యాఖ్యానించారు. భారత్ సహకారం అందించే ఒక పొరుగుదేశంగా కాకుండా, ఘర్షణ ధోరణి అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. భారత్ సహకార ధోరణికి బదులుగా, యుద్ధ వైఖరిని ఎంచుకుందని ఆరోపించారు. అయితే, శాంతియుతంగా జీవించాలా, లేక పోరటాన్ని కొనసాగించాలా? అనేది తమ నిర్ణయమని అన్నారు. పరస్పర ప్రేమ, గౌరవంతో జీవించాలనేది తమ ఆకాంక్ష అని షరీఫ్ చెప్పారు.
Read Also- Viral News: అసభ్యకర వీడియోలు చూస్తూ డ్రైవింగ్.. చివరికి ఏం జరిగిందంటే
గాజాలో జీవించడం కష్టమైపోయింది
కాశ్మీర్ అంశంపై మాట్లాడిన తర్వాత గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధంపై కూడా షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. గాజాలో ఇప్పటివరకు 64,000 మందికిపైగా ప్రాణ త్యాగాలు చేశారని వ్యాఖ్యానించారు. అక్కడి ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు నిలిపివేశారని పేర్కొన్నారు. గాజాలో జీవించడంతో పాటు సంపాదించడం కూడా అసాధ్యమైపోయిందని విచారం వ్యక్తం చేశారు.
భారత్-పాకిస్థాన్ దౌత్య సంబంధాలు పాతాళానికి పడిపోయిన నేపథ్యంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత, భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో, ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు మరింతగా దిగజారాయి. ఆ తర్వాత మే 7న భద్రతా బలగాలు పాకిస్థాన్‌పై ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరు దేశాల మధ్య నాలుగు రోజులపాటు జరిగింది మినీ యుద్ధమే అయినప్పటికీ, తీవ్రమైన సాయుధ సంఘర్షణ చోటుచేసుకుంది. భారత సేనలు పాకిస్థాన్, పీవోకేలోని జైషే మహ్మద్ (JeM), లష్కరే తోయిబాకు (LeT) చెందిన కీలక శిక్షణ శిబిరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను చనిపోయినట్టు అంచనాగా ఉంది.