Dussehra 2025: ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఏటా దసరా శరన్నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. దుర్గా దేవిని ఆరాదిస్తూ విభిన్నమైన థీమ్స్ తో నగరవ్యాప్తంగా పండాల్స్ (పందిర్లు) నిర్మిస్తుంటారు. ఈ క్రమంలో రాంచీ రైల్వే స్టేషన్ ప్రాంతంలో నిర్మించే పండాల్.. ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. వేలాది మంది సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. గతేడాది అయోధ్య రామాలయం, జార్ఖండ్ సంస్కృతి ప్రతిబింభించే థీమ్ తో అక్కడ పండాల్ నిర్మించారు. ఈసారి తిరుపతి బాలాజీ థీమ్ తో భారీ పండాల్ ను నిర్మిస్తుండటం ఆసక్తి రేపుతోంది.
75 అడుగుల ఎత్తులో..
తిరుమల వేంకటేశ్వరుడి థీమ్ తో రూపుదిద్దుకుంటున్న రాంచీ పండాల్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ పండాల్.. దసరాను పురస్కరించుకొని అతి త్వరలోనే సందర్శకులను ఆకట్టుకోనుంది. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే.. 75 అడుగుల ఎత్తులో తిరుమల గోపురం ఆకృతిలో ఈ పండాల్ ను రూపుదిద్దుకుంటోంది. దక్షిణ భారతీయ శైలిలోని శిల్పకళను ప్రతిబింబిస్తూ పండాల్ ప్రాంగణంలో 200కిపైగా విగ్రహాలు అమర్చనున్నారు. వీటివల్ల భక్తులకు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయంలోకి ప్రవేశించిన అనుభూతి కలగనుంది.
40 అడుగుల హనుమాన్ విగ్రహం
ఈసారి ప్రధాన ఆకర్షణగా పండాల్ ప్రవేశద్వారం వద్ద 40 అడుగుల ఎత్తైన భారీ బజరంగ్‌బలి (హనుమాన్) విగ్రహం ఏర్పాటుచేయబోతున్నారు. పండాల్‌లోకి ప్రవేశించిన తర్వాత భక్తులకు హనుమంతుని దర్శనం లభించనుంది. అలాగే దుర్గ మాతా, ఇతర దేవీ–దేవతల స్వర్ణవర్ణ విగ్రహాలు ఆకర్షణీయంగా నిలుస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఆధునిక లైటింగ్ మధ్య వీటి నుంచి వెలువడే బంగారు కాంతి చూపరులను కట్టిపడేస్తాయని అభిప్రాయపడుతున్నారు.
రూ.60-80 లక్షల ఖర్చుతో…
పండాల్ ప్రాంగణంలో భగవాన్ విష్ణువు దశావతారాల విగ్రహాలు కూడా దర్శనమివ్వనున్నాయి. అలాగే శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, శివుడు, పార్వతి దేవి, ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉండనున్నాయి. కాగా పండాల్ నిర్మాణానికి దాదాపు రూ.60-80 లక్షలు ఖర్చు చేయనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈసారి తిరుమల థీమ్ తో నిర్మించబోయే ఈ పండాల్.. ప్రతీ ఒక్క సందర్శకుడికి ఆధ్యాత్మికంగా ఓ అద్భుతమైన భావనను కలిగిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Indian Railways: రైల్వేలో కొత్త రూల్.. అక్టోబర్ 1 నుంచే అమలు.. ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!
భద్రత, సౌకర్యాలకు ప్రత్యేక ఏర్పాట్లు
రాంచీ స్టేషన్ లోని శ్రీ దుర్గాపూజా కమిటీ.. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. భారీగా వచ్చే జనసంద్రాన్ని నియంత్రించేందుకు మహిళలు, పురుషుల కోసం వేరువేరు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ‘ఈసారి రాంచీ స్టేషన్ దుర్గాపూజా పండాల్ ప్రత్యేకంగా నిలుస్తుంది. దాన్ని మరింత భవ్యంగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తున్నాం. దక్షిణ భారతీయ శైలిలో నిర్మించిన ఈ పండాల్ నగరవాసులకు చాలా నచ్చుతుంది’ అని శ్రీ దుర్గాపూజా కమిటీ అధ్యక్షుడు మున్చున్ రాయ్ తెలిపారు.