Uttar Pradesh: ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ యాత్రకు సైతం తెరలేపారు. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ స్పందిస్తూ యూపీలోని ఓటర్ జాబితాలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఓ ఇంట్లో ఏకంగా 4వేలకు పైగా ఓట్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ఒకే ఇంట్లో 4,271 ఓట్లు
దిల్లీలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడారు. ‘నిన్ననే నేను మహోబా (యూపీలోని జిల్లా)లోని రెండు ఇళ్ల గురించి చెప్పాను. ఒకింట్లో 243 మంది, మరొకింట్లో 185 మంది ఓటర్లు నమోదయ్యారు. అది మీకు షాకింగ్ గా అనిపించి ఉండొచ్చు. కానీ ఇవాళ నేను మరో ఉదంతాన్ని బయటపెట్టదలుచుకున్నా. ఒకే ఇంటిలో 4,271 మంది ఓటర్లు నమోదయ్యారు. ఒకింట్లో 4,271 ఓట్లు ఉంటే ఆ కుటుంబంలో సుమారు 12 వేల మంది సభ్యులు ఉండాలి. ఇంత పెద్ద కుటుంబాన్ని ఎవరైనా కనుక్కొండి’ అని వ్యాఖ్యానించారు.
‘అలా చేస్తే.. మీదే విజయం’
బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కు కావడం వల్లే యూపీలో ఓటు దోపిడి జరిగిందని ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ‘మహోబాలోని ఆ ఇంటి యజమానికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీరు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు ఖచ్చితంగా గెలుస్తారు. మీ కుటుంబ సభ్యులు మాత్రమే ఓటు వేస్తే సరిపోతుంది’ అని సెటైర్లు వేశారు. గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 16,000గా ఉందని.. అలాంటిది ఒక ఇంట్లోనే 4వేల మంది ఓటర్లు ఉండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆరోపించారు.
ఒక్క రూపాయికి 1,050 ఎకరాలు
భగల్పూర్‌లో భూమి కేటాయింపుపై ఆరోపణలు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. బీహార్‌లోని భగల్పూర్‌లో భూమి కేటాయింపుపై కూడా బీజేపీ–జేడీయూ కూటమిపై దాడి చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం గౌతమ్ అదానీ గ్రూప్‌కి 1,050 ఎకరాల భూమిని మూడు విద్యుత్ కేంద్రాల కోసం ఒక్క ఎకరానికి ఒక రూపాయికే 25 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చింది. కేవలం ఒక్క రూపాయికి భూమి ఇవ్వడమే కాకుండా మీరు ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసినా వచ్చే 25 సంవత్సరాల పాటు యూనిట్‌కు రూ.7 చొప్పున కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు విద్యుత్‌ను రూ.10, రూ.11 లేదా రూ.12కి కొనుక్కోవాల్సి వచ్చినా ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ప్రధానమంత్రి స్నేహితుడికి మాత్రం ఇబ్బంది రాకూడదు’ అని సింగ్ విమర్శించారు.
Also Read: CM Revanth Reddy: విద్యా విధానం మారాల్సిందే.. అవసరమైతే దేనికైనా సిద్ధం.. సీఎం రేవంత్
10 లక్షల మామిడి చెట్లు
అదానీకి ఇచ్చిన భూమిని బీజేపీ జేడీయూ ప్రభుత్వం.. 2012-13లోనే రైతుల నుంచి కొనుగోలు చేసిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. రైతులకు నష్టపరిహారం ప్రజా ధనం నుంచి చెల్లించిందని తెలిపారు. ‘ప్రభుత్వం ఆ భూమిని ఎక్కువ ధరకు అమ్మి ఆదాయం సంపాదించవచ్చు. కానీ అదానీకి ఒక్క రూపాయికే 25 సంవత్సరాల పాటు ఇచ్చింది. అధికారిక రికార్డుల ప్రకారం ఆ భూమిలో 70 శాతం బంజరుగా ఉంది. అక్కడ దాదాపు 10 లక్షల చెట్లు ఉన్నాయి. వాటిలో మాల్డా రకం మామిడి పండ్లు ఇచ్చే తోటలూ ఉన్నాయి. ప్రభుత్వానికి పర్యావరణం, చెట్లంటే సంబంధమే లేదు. వారికి డబ్బు సంపాదించడం మాత్రమే ముఖ్యం’ అని అన్నారు.