EV Charging Stations: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టడంపై సర్కార్ దృష్టి పెట్టింది. త్వరలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు వీటి ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయాలనే అంశంపై సర్వే చేపట్టారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3751 లొకేషన్లను గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటి వరకు డిస్కం పరిధిలో 630 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే కొత్త ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనదారులు బేఫికర్ ఉండొచ్చనే అభిప్రాయాన్ని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
Also Read: Sub-Register Office: ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ వివాదం.. మంచిరెడ్డి కిషన్ రెడ్డి సీరియస్!
రూ.2 వేల కోట్ల బడ్జెట్ కూడా
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రాయితీలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంపైనా రాయితీలు అందించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా పీఎం ఈ డ్రైవ్ పేరిట ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. రూ.2 వేల కోట్ల బడ్జెట్‌ను కూడా కేటాయించింది. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తెలంగాణలోని డిస్కంలు ఈవీ ఛార్జింగ్ పాయింట్ల విస్తరణకు విస్తృతంగా కృషిచేస్తున్నాయి. తెలంగాణలోని పలు జాతీయ రహదారుల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు కావాల్సిన కేంద్రాలను గుర్తించే పనిలో విద్యుత్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 13 జాతీయ రహదారులను కవర్ చేస్తూ 3,751 లొకేషన్లను విద్యుత్ శాఖ గుర్తించింది. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఈజీగా
మెట్రోపాలిటన్ సిటీల్లో ఈవీల పాత్ర కీలకం. దీంతో ఈవీల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. సమీపంలోని గమ్య స్థానాలకు చేరేందుకు ఈవీలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. పట్ణణాల్లో అవసరాలకు ఈ వాహనాలు వినియోగిస్తున్నా.. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఈవీలు వినియోగించే వారిలో మిడిల్ క్లాస్ కుటుంబాల సంఖ్యే ఎక్కువ. అయితే ఈ ఈవీలతో సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోసమే పీఎం ఈ డ్రైవ్ స్కీమ్‌ను కేంద్రం తీసుకొచ్చింది. వాస్తవానికి ఈవీల్లో బ్యాటరీ సామర్థ్యమే ఎంత దూరం ప్రయాణించగలమని నిర్ణయిస్తుంది. మిడిల్ క్లాస్ ప్రజలు తమ రేంజ్‌కు తగినట్టుగా వాహనాలు కొనుగోలు చేయడంతో సుదూర ప్రాంతాలకు చేరుకునేందుకు బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడం సమస్యగా మారింది. ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్లు ఉంటాయో కూడా తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అందుకే పీఎం ఈ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పీఎం ఈ డ్రైవ్‌లో భాగంగా ఛార్జింగ్ పాయింట్స్
రాష్ట్రంలో లో కొత్త ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం సబ్సిడీ అందిస్తున్నది. మొత్తం 4 కేటగిరీల్లో ఈ స్టేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేటగిరీ ఏ లో హైదరాబాద్, వరంగల్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు 100 శాతం సబ్సిడీ అందించనున్నారు. అంటే పూర్తి ఉచితంగా పీఎం ఈ డ్రైవ్‌లో భాగంగా ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. కేటగిరీ బీ లో పట్టణ ప్రాంతాలను తాకుతూ ఉండే జాతీయ రహదారులపై ప్రభుత్వ ఆధీనంలోని రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, బస్ స్టేషన్లు, మున్సిపల్ పార్కింగ్ ప్రాంతాల్లో పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటికి కూడా వంద శాతం సబ్సిడీ అందనున్నది. అలాగే కేటగిరీ సీ లో ప్రధాన వీధులు, మార్కెట్ కాంప్లెక్సులు, షాపింగ్ మాళ్లలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. కాగా, వీరికి 80 శాతం సబ్సిడీపై ఫిక్స్ చేయనున్నారు. కేటగిరీ సీ కింద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1464 మంది వ్యాపారులు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇక కేటగిరీ డీ లో ఏ లొకేషన్‌లో అయినా సరే.. బ్యాటరీ స్వాపింగ్/ బ్యాటర్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వీరికి కూడా 80 శాతం సబ్సిడీని కేంద్రం అందించనుంది.
జోన్లవారీగా డేటా
కొత్త ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం విద్యుత్ అధికారులు జోన్లవారీగా సర్వే చేపట్టారు. మెట్రో జోన్ పరిధిలో మొత్తం1263 లొకేషన్లను విద్యుత్ అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జోన్ పరిధిలో మొత్తం1195 లొకేషన్లు, మేడ్చల్ జోన్ పరిధిలో మొత్తం 886 లొకేషన్లు గుర్తించారు. అలాగే జాతీయ రహదారులపై 407 లొకేషన్లను గుర్తించారు. కాగా 50 కిలోవాట్ల వరకు ఏర్పాటుచేసుకుకే చార్జింగ్ స్టేషన్లకు రూ.6.04 లక్షల వ్యయం కానుంది. 100 కిలోవాట్ల వరకు రూ.14.80 లక్షలు, 150 కిలోవాట్ల వరకు ఏర్పాటుకు రూ.19 లక్షలు, 150 కిలోవాట్లకు పైబడి చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.24 లక్షల వ్యయం కానుంది.
ఈవీల్లో దేశానికి క్యాపిటల్‌గా హైదరాబాద్ మారాలి
పీఎం ఈ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రం ఎక్కువ ప్రయోజనాలు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే వినియోగదారులను ప్రోత్సహించేందుకు అవగాహన కల్పిస్తున్నాం. ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్ల(సీపీవో)తో చర్చలు కూడా జరిపాం. ఆర్టీసీ ఉన్నతాధికారులను కూడా కలిసి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చలు జరిపాం. ఈవీల్లో దేశానికి క్యాపిటల్‌గా హైదరాబాద్‌ను మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఈవీల్లో కూడా సుదూర ప్రయాణాలు చేసుకునేలా ఏర్పాట్లను ముమ్మరంగా చేపడుతున్నాం. సెక్రెటేరియట్ పరిసరాల్లో కూడా వీటి ఏర్పాటుకు సర్వే పూర్తి చేశాం.
ముషారఫ్ ఫరూఖీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ.
Also Read: Post Office Scheem: రోజుకు రూ.2 పెట్టుబడితో.. రూ.10 లక్షలు పొందే.. అద్భుతమైన పోస్టాఫీసు స్కీమ్!
