HYDRA Prajavani: హైడ్రా ప్రజావాణికి 43 ఫిర్యాదులు
వరద ముప్పును నివారించాలి
కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డుంకులు తొలగించాలంటూ వినతులు
ఫిర్యాదులను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: వర్షాకాలం తమ కాలనీలలో వరద, మురుగు నీరు చేరుతోందని, చిన్నపాటి వర్షానికే ఇళ్లలోకి నీరు చేరుతోందని, వర్షం నీరు ప్రవహించకుండా కాలువల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించాలంటూ పలు కాలనీల వాసులు హైడ్రాకు మొరబెట్టుకున్నారు. వరద ముప్పును నివారించి, తమను కాపాడాలని కోరారు. ఈ మేరకు సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి (HYDRA Prajavani) 43 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. పలు కాలనీల నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మురుగు నీటి కాలువలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా, వదిలేయడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. మురుగునీటి కాలువలకు ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టించడంతో వర్షం వచ్చినప్పుడు తమ నివాస ప్రాంతాలు నీట మునిగిన కొన్ని వీడియోలు, ఫొటోలను చూపించి, సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు.
బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 5లో వీధి నంబరు 1లో లేఔట్ ప్రకారం 60 అడుగుల రహదారి ఉండగా, ఇప్పుడు అది కేవలం 20 అడుగులకే పరిమితమైందని ఓ మాజీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి విలేజీలో ఉన్న చిన్న, పెద్ద చెరువు కబ్జాలను నియంత్రించాలని ముప్పాస్ గ్రీన్ గ్రాండ్యుర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్కడ వెంచర్ల వారు చెరువులో రోడ్డు వేశారని, చుట్టు పక్కల ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల నుంచి చెత్త వేయడమే కాకుండా, మురుగు నీటిని చెరువులోకి వదిలేయడంతో దుర్గంధంగా మారుతోందని ఫిర్యాదులో ప్రతినిధులు పేర్కొన్నారు. ఒకప్పుడు ఎంతో ఆహ్లాదంగా జీవకోటికి ప్రాణాధారంగా ఉండే ఈ చెరువులో చేపలు చనిపోయి తేలుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 43 ఫిర్యాదులు అందాయని, ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి, పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు.
Read Also- Viral Video: ప్రభుదేవా సాంగ్‌కు.. దుమ్మురేపిన ప్రొఫెసర్.. డ్యాన్సర్లు సైతం కుళ్లుకోవాల్సిందే!
ఫిర్యాదులిలా..
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బీఎన్‌రెడ్డి డివిజన్‌లోని సాహేబ్ కలాన్ తదితర ప్రాంతాలలో ఉన్న 16 కాలనీల వరద, మురుగు నీరు నేరుగా కప్పల చెరువులో కలిసేది. ఇప్పుడు ఆ కాలువను డైవర్ట్ చేసి దగ్గరలోని రిజర్వు ఫారెస్టులోకి మళ్లించడంతో కింద ఉన్న గ్రీన్‌సిటీ, లుంబినీ అలైట్, గాంధీనగర్, స్నేహమయి నగర్, అఖిలాండేశ్వరి, గాంధీనగర్ సౌత్ కాలనీలు నీట మునుగుతున్నాయని ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో పిర్యాదు చేశారు. మరో 50 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన లైనుకు ఈ కాలువను కలిపితే మురుగునీరు, వరద నీరు అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా నియంత్రించవచ్చునని. వెంటనే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
శేరిలింగంపల్లి మండలం మాధాపూర్ అయ్యప్ప సొసైటీలో వంద అడుగుల రహదారిలోని మెగాహిల్స్ వద్ద మురుగునీరు వెళ్లకుండా అక్కడ బండరాళ్లు, మట్టి వేయడంతో కాలువకు ఆటంకం ఏర్పడిందని, వర్షపు నీటితో పాటు మురుగు నిలిచిపోయి తమ నివాసాలు నీట మునుగుతున్నాయని, గోడలు నాని వాచ్ మ్యాన్ కోసం నిర్మించిన ఇల్లు కూలిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే మురుగు, వరద నీరు వెళ్లేందుకు మార్గం చూపి మా నివాస ప్రాంతాలను కాపాడాలని స్థానికులు కోరారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లేలగూడ విలేజ్‌లో గ్రేవ్‌యార్డు కబ్జా కాకుండా కాపాడాలని సయ్యద్ మసీద్ అండ్ గ్రేవ్‌యార్డు ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 76లో మొత్తం 1.28 ఎకరాల మేర గ్రేవ్ యార్డు ఉండగా, దానిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, కోర్టు ఉత్తర్వులున్నా వాటిని ఎవరూ పట్టించుకోవడంలేదంటూ వాపోయారు. ఘట్‌కేసర్ మండలం ప్రతాప్‌సింగారంలో 25.17 ఎకరాల మేర 1988లో 380 ప్లాట్లతో లేఔట్ వేయగా, తర్వాత 2017లో ధరణి ద్వారా పట్టాదారు పాసు పుస్తకం సృష్టించారు. దీనిపై 2023లో ప్లాట్ ఓనర్లు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ పాసు పుస్తకాలు రద్దయ్యాయి. ఆరుగురు పట్టాదారుల్లో ఐదుగురు తప్పుకోగా, ఆరవ పట్టాదారుడి కుమారుడు వచ్చి తన భూమి 6.15 ఎకరాల మేర చుట్టూ ప్రహరీ నిర్మించాడని, ప్రహరీని తొలగించి, అందులోని రహదారులు, పార్కులను కాపాడాలని ప్లాట్ల ఓనర్లు హైడ్రా ప్రజావాణిలో పిర్యాదు చేశారు.