Hyderabad Old City: హాఫీజ్ బాబా నగర్ జంక్షన్ నుంచి బాలాపూర్ వరకు మరో ఫ్లై ఓవర్
పాతబస్తీలో ట్రాఫిక్ కష్టాలకు సెలవు.. మార్చి నుంచి పనులు!
ఆరు లేన్ల బై డైరెక్షనల్ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం
రూ. 385 కోట్లతో ప్రతిపాదనలు
12న ప్రీ బిడ్ సమావేశం..3 నుంచి టెండర్ల స్వీకరణ
మార్చి 1 నుంచి పనులను చేపట్టే యోచనలో జీహెచ్ఎంసీ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యపై సర్కారు ముందస్తు ప్రణాళికలతో ముందుకెళ్తుంది. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే సర్కారు రానున్న 30 ఏళ్లను దృషిలో పెట్టుకుని హెచ్‌సిటీ పనుల కింద అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లు, అవసరమైన చోట గ్రేడ్ సెపరేటర్లతో పాటు ర్యాంప్‌లను కూడా నిర్మించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఇటీవలే 2 వేల 53 చదరపు కిలోమీటర్లకు విస్తరించిన జీహెచ్ఎంసీలోని పాతబస్తీ (Hyderabad Old City) నుంచి శివారు ప్రాంతాలకు కనెక్టవిటీగా ఉన్న మెయిన్ రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు కూడా చెక్ పెట్టేందుకు సిద్దమైంది.
Read Also- Jogipet Municipality: ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ అభ్యర్థిత్వాలు ఖరారు… జోగిపేటలో ఇదీ పరిస్థితి
ఇందులో భాగంగా నిత్యం రద్దీగా ఉండే హాఫీజ్ బాబా నగర్ జంక్షన్ నుంచి బాలాపూర్ చర్చి రోడ్ వరకు (మెట్రో ఫంక్షన్ హాల్ మీదుగా ఒమర్ హోటల్ నుంచి షోయబ్ హోటల్ వరకు) ఆరు లైన్ల బై డైరెక్షనల్ గ్రేడ్ సెపరేటర్ తో కూడిన ఫ్లై ఓవర్ వంతెనను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. దీంతో పాటు ప్రస్తుతమున్న ఓవైసీ ఫ్లై ఓవర్ కోసం లెఫ్ట్ ఆర్మ్ డౌన్ ర్యాంపు ను కూడా నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీంతో పాటు బండ్ల గూడా నుంచి ఎర్రకుంట క్రాస్ రోడ్డు వరకు ఆరు లైన్ల మరో బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్ ను కూడా నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్దం చేసింది. మూడు రకాల ఈ పనులకు జీహెచ్ఎంసీ రూ. 385 కోట్లకు గాను పరిపాలనపరమైన అనుమతి తీసుకుంది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని సర్కారు హెచ్‌సిటీకి ఇప్పటికే మంజూరు చేసిన రూ.7038 కోట్లలో భాగంగా వెచ్చించనున్నట్లు తెలిసింది. ఈ పనులకు సంబంధించి ఫిబ్రవరి 3 నుంచి టెండర్లను స్వీకరించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది.
Read Also- Varanasi: మహేష్ బాబు ‘వారణాసి’ అప్పుడే ప్రచారం మొదలెట్టేశారా?.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
వచ్చే నెల 12న ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించి, వచ్చే నెల 20వ తేదీ వరకు టెండర్లను స్వీకరించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. టెక్నికల్, ఫైనాన్స్ బిడ్ల ప్రక్రియను పూర్తి చేసినానంతరం మార్చి 1వ తేదీ నుంచి పనులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఓవైసీ ఫ్లై ఓవర్ కు ర్యాంప్, హాఫీజ్ బాబా నగర్ జంక్షన్ నుంచి బాలాపూర్ చర్చి రోడ్ వరకు, బండ్లగూడ నుంచి ఎర్రకుంట క్రాస్ రోడ్డు వరకు రెండు ఆరు లైన్ల ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే పాతబస్తీ, శంషాబాద్ ఏయిర్ పోర్డు నుంచి బాలాపూర్ తదితర ప్రాంతాలకు రాకపోకలు ఎలాంటి అడ్డంకుల్లేకుండా మరింత వేగంగా సాగే అవకాశాలున్నట్లు తెలిసింది. త్వరలో పాతబస్తీలో రానున్న హైదరాబాద్ మెట్రో రైలు, చాంద్రాయణగుట్ట నుంచి హయత్ నగర్ వరకు విస్తరించనున్న మెట్రో రైలు ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుుకుని ఈ రెండు ఫ్లై ఓవర్లు, ఓ ర్యాంప్ నిర్మాణ ప్రతిపాదనలను సిద్దం చేసినట్లు సమాచారం.

