Jogipet Municipality:
జోగిపేట,స్వేచ్ఛ: అందోలు-జోగిపేట మున్సిపాలిటీ (Jogipet Municipality) పరిధిలోని అధికార కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠభరిత మైన వాతావరణం మద్య ఎట్టకేలకు జరిగింది. మున్సిపాలిటీలో 20 వార్డులుండగా 16 వార్డులు దాదాపు పూర్తి కాగా, మాజీ కౌన్సిలర్ ఎ.చిట్టిబాబు పోటీ చేయాలనుకున్న 15వ వార్డును మైనార్టీలకు ఇచ్చేందుకు మొగ్గు చూపగా, పార్టీకి పదేళ్లుగా సేవలు అందించి, పటిష్టతకు పనిచేసినందుకుగా చిట్టిబాబుకే మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ఖరారు చేశారు. 14,17 వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక భాద్యతను కూడా ఆయనకే అప్పగించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా న్యాయవాది ఎస్.కిష్టారెడ్డి పేరును కాంగ్రెస్ ప్రకటించింది. ఆయన 20వ వార్డు నుంచి పోటీకి దిగనున్నారు. నామినేషన్ల చివరి రోజున అధికార కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టికెట్ల విషయంలో ఆశావహులు ఉత్కంఠతో ఉండగా గురువారం నాడు తెరపడింది. ముఖ్యంగా చిట్టిబాబు అభ్యర్థిత్వం ఖరారుపై పట్టణంలో చర్చనీయాంశమైంది.

