Medchal Accident: మేడ్చల్ వద్ద రోడ్డు ప్రమాదం: ట్రాక్టర్ డ్రైవర్ మృతి
మేడ్చల్/శామీర్‌పేట: శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం (Medchal Accident) జరిగింది. హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారిపై వెళుతున్న ఓ ట్రాక్టర్‌ను తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ చౌరస్తా వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రెండు ముక్కలు అయ్యింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం, చనిపోయిన వ్యక్తిని ఆకాశ్ ఉత్తమ్ సోనె (31) గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన అతడు స్థానికంగా నివాసం ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ నడుపుతున్న ఆకాశ్.. ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ట్రాక్టర్‌లో ఉన్న మరో వ్యక్తి జగదేవ్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, అతడిని హాస్పిటల్‌కు తరలించారు. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక లారీ ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చెరువులో పాలిటెక్నిక్ విద్యార్థి గల్లంతు
మహబూబాబాద్‌లో విషాదం
మహబూబాబాద్, స్వేచ్ఛ: మహబూబాబాద్ జిల్లా శివారులోని అనంతారం మైసమ్మ చెరువులో పాలిటెక్నిక్ విద్యార్థి గల్లంతయ్యాడు. బాధిత విద్యార్థి పేరు భూక్య సాయికిరణ్. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కేసముద్రంలో పాలిటెక్నిక్ చదువుతున్న మొత్తం 8 మంది విద్యార్థులు అనంతారంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు. దర్శనం అనంతరం, స్నానం చేసేందుకు పక్కనే ఉన్న మైసమ్మ చెరువులోకి ముగ్గురు విద్యార్థులు ఈత కోసం దిగారు. ఈ ముగ్గురిలో భూక్య సాయికిరణ్ చెరువులో గల్లంతయ్యాడు. గల్లంతైన సాయికిరణ్ ఆచూకీ కోసం ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF), ఫైర్ సిబ్బంది, రూరల్ పోలీస్ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ విషయమై రూరల్ ఎస్సై (SI) దీపిక రెడ్డిని వివరణ కోరగా, ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అయితే ఇంకా సాయికిరణ్ ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు.
Read Also- Crocodile Captured: హమ్మయ్య.. ఎట్టకేలకు మొసలి చిక్కిందోచ్!

