Devaraaya Ramesh: తెలంగాణ ఉద్యమ అగ్నిజ్వాల
దేవరాయ రమేష్ ఆత్మార్పణ యత్నానికి నేటికి 16 ఏళ్లు
సహాయం కోసం నేడు వేడుకోలు!
కట్కూర్ వాటర్ ట్యాంక్‌పై నుంచి ఆత్మార్పణయత్నం
ఉద్యమంలో కొత్త జోష్ నింపిన దేవరాయ రమేష్
2009 డిసెంబర్ 6 – తెలంగాణ చరిత్రలో ప్రత్యేక దినం
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆవేదనతో రమేష్ బలిదాన ప్రయత్నం
బచ్చన్నపేట, స్వేచ్ఛ: తెలంగాణ రాష్ట్ర ఉద్యమం (Telangana Movement) ఉద్ధృతంగా జరుగుతున్న సమయంలో, ఉద్యమ నేత కే. చంద్రశేఖర్ రావు (KCR) నిమ్స్ ఆస్పత్రిలో నిరాహార దీక్షతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనే వార్తలు తెలంగాణ అంతటా ఉద్వేగాన్ని పెంచాయి. ఈ సమయంలోనే, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన యువకుడు దేవరాయ రమేష్ (Devaraaya Ramesh) తీవ్ర ఆవేదన చెందాడు. తెలంగాణ సాధనపై గాఢమైన నమ్మకంతో, రాష్ట్ర ఆకాంక్షను కేంద్రానికి తెలియజేయాలనే సంకల్పంతో, 2009 డిసెంబర్ 6న గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి, కిందకు ఆత్మార్పణ ప్రయత్నం చేశాడు. ఈ ఘటన జరిగి నేటికి (డిసెంబర్ 6) 16 సంవత్సరాలు అవుతుంది.
ఉద్యమంలో కొత్త స్ఫూర్తి
ఈ ఆత్మార్పణ ప్రయత్నం గ్రామాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను కదిలించింది. రమేష్ చేసిన బలిదానయత్నం తెలంగాణ ఉద్యమంలో మళ్లీ కొత్త జోష్ నింపి, ప్రజల్లో తెలంగాణ భావజాలాన్ని మరింత బలోపేతం చేసింది. తెలంగాణ రాష్ట్ర నిర్మాణ యజ్ఞంలో చేసిన త్యాగానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటనను గ్రామస్తులు, ఉద్యమ కార్యకర్తలు నేటికీ గౌరవంగా స్మరించుకుంటున్నారు. దేవరాయ రమేష్ పేరు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడుతున్నారు. రమేష్ చేసిన ఆ బలిదానయత్నం గ్రామానికే కాదు, మొత్తం ప్రాంతానికే భావోద్వేగాల వెల్లువ తెప్పించిందని గుర్తుచేసుకుంటున్నారు.
Read Also- CM Chandrababu: జగన్‌కు దేవుడన్నా లెక్కలేదు.. సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
ప్రభుత్వానికి రమేష్ వేడుకోలు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమై వాటర్ ట్యాంక్ పైనుండి దూకిన దేవరాయ రమేష్ ప్రాణాపాయ స్థితిలో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందారు. అయితే, ఈ ఘటనతో తన అవయవాలు సహకరించకపోవడంతో ప్రస్తుతం ఉపాధి లేక, ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉందని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తనను ఆదుకోవాలని, ఉపాధి చూపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రమేష్ కోరాడు. ఇదే విషయమై ఇదివరకు గత ప్రభుత్వానికి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also- Minister Ponguleti: నోరుంది కదా అని తప్పుడు ప్రచారం చేయొద్దు: మంత్రి పొంగులేటి వార్నింగ్

