Crime News: పహాడీషరీఫ్‌లో ప్రతీకార హత్య!
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ ప్రాంతంలో ఓ రౌడీషీటర్‌ను దుండగులు దారుణంగా హత్య (Crime News) చేశారు. ఇది ప్రతీకార హత్య అని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ఇప్పటికే నిందితులను గుర్తించిన పోలీసులు వారి కోసం గాలింపు మొదలు పెట్టారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎంఎం పహాడీ ప్రాంత నివాసి షేక్ ఆమెర్ (32)పై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కొన్నాళ్లక్రితం రౌడీషీట్ ఓపెన్ అయింది. పలు హత్యల కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆమెర్ చాలా రోజులపాటు జైల్లో ఉండి కొంతకాలం క్రితం బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చాడు. కాగా, అతడితో శాంతిభద్రతల సమస్యలు వస్తుండటంతో రాజేంద్రనగర్ పోలీసులు ఇటీవలే అతడిని స్టేషన్‌కు పిలిపించారు. 6 నెలలపాటు స్టేషన్ పరిధిలో ఉండవద్దని అతడిపై తడీపార్ విధించారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్పటి నుంచి ఆమెర్ ఎంఎం పహాడీలో కాకుండా ఇతర ప్రాంతంలో నివాసముంటున్నాడు.
Read Also- Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి
శనివారం బాలాపూర్ గ్రీన్ సిటీ ప్రాంతంలో ఉంటున్న తన అన్న షేక్ ఫరీద్ వద్దకు వెళ్లి, తనపై పోలీసులు విధించిన తడీపార్ గురించి ఆమెర్ తెలిపాడు. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు వెళ్లి అక్కడే 2 మూడు నెలలపాటు ఉందామని అనుకుంటున్నట్టు చెప్పి డబ్బు సాయం చేయమని కోరాడు. దానికి షేక్ ఫరీద్ ఒప్పుకొన్నాడు. అనంతరం అక్కడి నుంచి తన స్నేహితులైన సయ్యద్ అమన్, హుస్సేన్‌లతో కలిసి బయల్దేరిన ఆమెర్, అర్ధరాత్రి సమయంలో వాదియే ముస్తఫా ప్రాంతంలోని ఓ హోటల్‌కు వెళ్లాడు.
అదే సమయంలో ముఖాలకు ముసుగులు ధరించి బైక్‌లపై అక్కడికి వచ్చిన దుండగులు ఆమెర్‌పై కత్తులతో దాడి చేశారు. విచక్షణారహితంగా పొడవటంతో రక్తం మడుగులో ఆమెర్ కుప్పకూలిపోయాడు. సయ్యద్ అమన్ అందించిన సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న షేక్ ఫరీద్ తమ్ముడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే ఆమెర్ చనిపోయాడు. విషయం తెలియగానే పహాడీషరీఫ్ ఇన్స్‌పెక్టర్ రాఘవేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు.
Read Also- Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం
ఫుటేజీల ఆధారంగా అహమద్ మహ్మద్, ఇబ్రహీంతో పాటు మరో నలుగురు కలిసి ఈ హత్యకు పాల్పడినట్టుగా నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత సంవత్సరం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రౌడీషీటర్ ముబారక్ సిగార్ హత్య కేసులో ఆమెర్ నిందితుడిగా ఉన్నట్టు పహాడీషరీఫ్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆమెర్‌పై కక్షగట్టిన ముబారక్ సిగార్ కుటుంబ సభ్యులే ఈ దారుణానికి తెగబడినట్టుగా తెలుస్తోందని వెల్లడించారు.

