Bondi Beach Attack: ఆస్ట్రేలియా దేశ చరిత్రలో అత్యంత తీవ్రమైన ఉగ్రదాడి జరిగింది. సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్ (Bondi Beach Attack) వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మృతుల్లో ఒకటి దుండగుడు కూడా ఉండగా, మరొక ఉగ్రవాది చావుబతుకుల మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. యావత్ ఆస్ట్రేలియాను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ముష్కర దాడి… యూదులను టార్గెట్ చేసుకొని జరిగింది. యూదుల పండుగ హనుక్కా (Hanukkah) సందర్భంగా ఏర్పాటు చేసుకున్న బహిరంగ వేడుకలే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఈ ఘటన ఉగ్రదాడి అని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ప్రకటించారు. ఈ దాడిని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తీవ్రంగా ఖండించారు. యూదులకు వ్యతిరేకంగా జరిగిన ఉగ్రదాడిగా ఆయన అభివర్ణించారు.
Read Also- India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?
యూదుల పండుగ లక్ష్యంగా…
బీచ్ సమీపంలోని ఆర్చర్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు దుండగులు పొడవాటి తుపాకులతో (Long Arms) హనుక్కా వేడుకల్లో భాగంగా గుమిగూడిన జనసమూహంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ‘చబాద్ ఆఫ్ బాండీ’ (Chabad of Bondi) అనే యూదు సంస్థ నిర్వహించిన హనుక్కా వేడుకలే టార్గెట్‌గా దాడి చేశారని పోలీసులు, ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. గత కొంతకాలంగా ఆస్ట్రేలియాలో యూదుల టార్గెట్‌గా జరుగుతున్న ద్వేషపూరిత దాడుల్లో ఇది అత్యంత ఘోరమైనది కావడం గమనార్హం.
పోలీసుల తక్షణ స్పందన
బాండీ బీచ్‌లో ఉగ్రదాడిపై పోలీసులు తక్షణమే స్పందించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడికి పాల్పడ్డ ఇద్దరు దుండగుల్లో ఒకరిని కాల్చిచంపారు. రెండో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఓ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. చనిపోయిన దుండగుడు పోలీసు అధికారులకు తెలిసిన వ్యక్తే అని, అయితే, అతడితో ఉగ్రవాద ముప్పు గురించి సమాచారం లేదని పోలీస్ కమిషనర్ మాల్ లాన్యాన్ (Mal Lanyon) ధృవీకరించారు.
Read Also- Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!
పేలుడు పదార్థాలు గుర్తింపు
చనిపోయిన దుండగుడి కారులో పేలుడు పదార్థాలు ఉన్నట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. మరింత భారీ దాడి చేయాలని కుట్ర పన్నినట్టుగా స్పష్టమవుతోందని అధికారులు చెప్పారు. న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర క్రైమ్ కమాండ్ దర్యాప్తు అధికారులతో పాటు, ఉగ్రవాద నిరోధక కమాండ్ ఈ కేసు విచారణ చేపడతాయని ఉన్నతాధికారులు ప్రకటించారు.
పౌరుల ధైర్యసాహసం
భయానక బాండీ బీచ్ ఉగ్రదాడి సమయంలో కొందరు సామాన్య పౌరులు అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. తుపాకీతో కాల్పులు జరుపుతున్న ఉగ్రవాడిని ఓ సామాన్య పౌరుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అతడికి పక్కనే కాల్పులు జరుగుతుంటే, ఆ కాల్పుల శబ్దాలు విని పారిపోలేదు. పార్కింగ్ చేసివున్న కార్ల చాటునుంచి వెళ్లి దుండగుడిని వెనుకనుంచి గట్టిగా పట్టుకొని తుపాకీ లాక్కున్నాడు. ఆ సమయంలో చాలా మంది ఉగ్రదాడి నుంచి తప్పించుకున్నారు. కాగా, ఉగ్రవాదిని సామాన్య పౌరుడు అడ్డుకుంటున్న దృశ్యం సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. ప్రతి ఒక్కరూ అతడి ధైర్యాన్ని కొనియాడుతున్నారు.

