Jubilee Hills byPoll: ఉప ఎన్నికల వేళ ఆంక్షలు
ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సజ్జనార్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో పలు ఆంక్షలు (Jubilee Hills byPoll) విధిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నియోజకవర్గం పరిధిలోని వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. కౌంటింగ్ జరగనున్న 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, ప్రచార సమయం ముగిసిన తరువాత ఎలాంటి సభలు, సమావేశాలు జరపవద్దని పేర్కొన్నారు. ఐదుగురికన్నా తక్కువ మంది ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసుకోవచ్చన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ముగ్గురికన్నా ఎక్కువ మంది గుమిగూడవద్దని తెలిపారు. జెండాలతో ఉన్న కర్రలు, కర్రలు, ఆయుధాలు తీసుకెళ్లటం నిషిద్ధమన్నారు. ఇక, నియోజకవర్గ పరిధిలో మైకులు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లను కూడా నిషేధించినట్టు పేర్కొన్నారు. షామియానాలు, తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేయవద్దన్నారు.
ఆర్మ్డ్ రిజర్వ్‌డ్ పాత్ర కీలకం: సీపీ సజ్జనార్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్ డ్ రిజర్వ్ డ్ విభాగం పాత్ర కీలకమైందని హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ అన్నారు. పోలీసు శాఖలో పని చేస్తున్న ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పాతబస్తీ పెట్లబుర్జులోని సిటీ ఆర్మడ్ రిజర్వ్ డ్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం జరిగిన సెరిమోనియల్ పరేడ్‌లో పాల్గొన్న కమిషనర్ సజ్జనార్ సిబ్బంది నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్ధాల చరిత్ర ఉన్న సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ డ్ విభాగానికి మంచి పేరుందని, దానిని కొనసాగించాలని చెప్పారు. ఇతర ఉద్యోగాలతో పోలిస్తే పోలీస్ జాబ్ భిన్నమని అన్నారు. పని ఒత్తిడి ఉన్నా కుటుంబ సభ్యులకు అవసరమైనంత సమయాన్ని ఇవ్వాలని చెప్పారు. ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి పెట్టాలన్నారు.
Read Also- Mana Shankara Vara Prasad Garu: వైరల్ సెన్సేషన్.. మరో బెంచ్‌మార్క్‌కు చేరుకున్న ‘మీసాల పిల్ల’!
చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని చెప్పారు. సమయాన్ని వృధా చేయకుండా వృత్తి నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు. పరేడ్ లో ఆర్మ్ డ్ రిజర్వ్ డ్ విభాగానికి చెందిన 1,044మంది సిబ్బంది పాల్గొన్నారు. వారితోపాటు సిటీ సెక్యూరిటీ గార్డ్, స్వాఫ్ట్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కూడా దీంట్లో పాలు పంచుకున్నారు. పరేడ్ అనంతరం కమిషనర్ సజ్జనార్ సిబ్బందితో నేరుగా మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వారికి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ తోపాటు క్రెచ, ఆర్ట్స్, ఆయుధాల స్టోర్ రూం, బ్యారక్స్ తదితర వాటిని పరిశీలించారు. కార్యక్రమంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, అదనపు డీసీపీఉల భాస్కర్, కిష్టయ్య, కరుణాకర్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
