Cyber Crime: శభాష్ శ్రీకాంత్ నాయక్
రూ.5 లక్షలు వెనక్కి రప్పించిన కానిస్టేబుల్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బాధితుల నుంచి అందే ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందిస్తే ఫలితం ఎలా ఉంటుందో నిరూపించే ఉదంతమిది. ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబర్ క్రిమినల్స్ (Cyber Crime) ఉచ్ఛులో చిక్కి 10 లక్షల రూపాయలు పోగొట్టుకోగా కంప్లయింట్ వచ్చిన వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం స్టేషన్ కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ స్పందించారు. రూ.5 లక్షల వెనక్కి వచ్చేలా చూశారు. దీంతో, కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్‌ను సైబర్ క్రైం డీసీపీ దార కవిత అభినందించారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. పెన్షన్ డబ్బు ఆ ఖాతాలోనే జమవుతుంది. కాగా, పెన్షన్ డబ్బు క్రమం తప్పకుండా రావటానికి లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి రావటంతో వృద్ధుడు ఆన్‌లైన్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫోన్ నెంబర్ కోసం సెర్చ్ చేశాడు. దాంట్లో సైబర్ క్రిమినల్స్ అప్‌లోడ్ చేసిన నంబర్ నిజమైందనుకుని దానికి ఫోన్ చేశాడు. తనను తాను బ్యాంక్ అధికారిగా చెప్పుకొన్న సైబర్ మోసగాడు వృద్ధుడి మొబైల్‌కు ఓ ఏపీకే ఫైల్ పంపించాడు. దానిని ఇన్‌స్టాల్ చేసుకుని తాను చెప్పినట్టుగా చేస్తే పని పూర్తవుతుందన్నాడు.
Read Also- Mana Shankara Vara Prasad Garu: వైరల్ సెన్సేషన్.. మరో బెంచ్‌మార్క్‌కు చేరుకున్న ‘మీసాల పిల్ల’!
దాంతో వృద్ధుడు ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసి సైబర్ క్రిమినల్ చెప్పినట్టుగా తన వివరాలను అప్‌లోడ్ చేశాడు. ఆ వెంటనే వృద్ధుడి మొబైల్ ఫోన్‌ను తన ఆధీనంలోకి తీసుకున్న సైబర్ మోసగాడు 10 లక్షల రూపాయలను తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. ఈ మేరకు వచ్చిన మెసేజులను చూసి కంగారుపడ్డ వృద్ధుడు వెంటనే హైదరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ వృద్ధుడి ఫోన్ నుంచి ఏపీకే ఫైల్ ను డిలీట్ చేశారు. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ సహాయంతో రేజర్ పే ద్వారా డబ్బు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్‌లోని అకౌంట్‌కు వెళ్లినట్టుగా గుర్తించాడు. ఆ వెంటనే రేజర్ పే నోడల్ ఆఫీసర్‌గా ఉన్న హర్షవర్దన్ రావుకు నోటీస్ పంపించాడు. దాంతో హర్షవర్ధన్ రావు రూ.5 లక్షలను వేరే ఖాతాలోకి వెళ్లకుండా బ్లాక్ చేశాడు. అనంతరం ఆ మొత్తాన్ని వృద్ధుడి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. దీనిపై డీసీపీ దార కవిత మాట్లాడుతూ, ఆర్టీవో చలాన్, ఆర్టీఏ చలాన్ 140.ఏపీకే, కస్టమర్ కేర్ ఏపీకే, బ్యాంక్ ఏపీకే ఫైళ్లు మొబైల్ ఫోన్‌కు వస్తే వాటిని ఇన్ స్టాల్ చేయవద్దని సూచించారు.
