Sanitation Workers: ఇకపై కార్మికులకు జరిమానాలు!
శానిటేషన్ పర్మినెంట్ ఉద్యోగులకు ఎఫ్ఆర్ఎస్
మున్ముందు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌కు జీతాల లింకు
జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు
మెరుగైన శానిటేషనే లక్ష్యం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: హైదరాబాద్ ప్రజలకు జీహెచ్ఎంసీ అందించే అత్యవసర సేవల్లో శానిటేషన్ ప్రధానమైంది. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్ల నుంచి ప్రతిరోజూ సుమారు 6 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సకాలంలో సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. అయితే, ఎంత ప్రత్యేకంగా మానిటరింగ్ చేసినా, విమర్శలు తప్పటం లేదు. మున్ముందు కనీసం ఈ విమర్శలను తగ్గించుకునేందుకు శానిటేషన్ విభాగంలోని కార్మికులంతా (Sanitation Workers) పని చేసేలా పకడ్బందీ చర్యలకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేసింది.
నగరం మరింత పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా మారాలంటే ప్రజల భాగస్వామ్యంతో పాటు శానిటేషన్ విభాగ ఉద్యోగుల సేవలు కూడా చాలా అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో కాస్త కఠినంగా వ్యవహారించేందుకు అధికారులు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రాంకీ సంస్థతో పాటు రోడ్లపై చెత్త వేసే వారికే పరిమితమైన జరిమానాలను ఇకపై శానిటేషన్ వర్కర్లకు కూడా వర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇదివరకే ఈ నిర్ణయం దిశగా ఆలోచించినా, సక్రమంగా అమలు కాకపోవటంతో, ఈసారి కట్టుదిట్టంగా అమలు చేయాలని శానిటేషన్ విభాగం ఉన్నతాధికారులు గురువారం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా సర్కిళ్ల వారీగా ఉన్న డిప్యూటీ కమిషనర్లంతా ఉదయం ఐదున్నర గంటల కల్లా ఫీల్డులో ఉండాలని కమిషనర్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Read Also- Collector Rahul Raj: బాల్యవివాహాలపై మెదక్ జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
మున్ముందు ఆ రెండింటికి లింక్
జీహెచ్ఎంసీ శానిటేషన్ వింగ్ లో సుమారు 18 వేల మంది కార్మికులు ఔట్ సోర్స్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తుండగా, మరో 1500 మంది పర్మినెంట్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా వివిధ కార్మిక, ఉద్యోగుల యూనియన్ల పేర్లు చెబుతూ వీరిలో సగం మంది విధులకు హాజరుకావటం లేదన్న విషయాన్ని ఫీల్డు లెవెల్ లో ఉన్నతాధికారులు గుర్తించారు. వీరందరు కూడా సక్రమంగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఔట్ సోర్స్ కార్మికులకు అమలు చేస్తున్న ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ను శానిటేషన్ విభాగంలోని పర్మినెంట్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సగం మందికి ఈ సిస్టమ్ ను అమలు చేస్తుండగా, మొత్తం 1500 మంది పర్మినెంట్ కార్మికులను ఎఫ్ఆర్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఉద్యోగ భద్రత లేని ఔట్ సోర్స్ కార్మికులు కొంత మేరకు విధులను బాగానే నిర్వహిస్తున్నా, పర్మినెంట్ ఉద్యోగుల విధి నిర్వహణను మెరుగు పరిచేందుకు వారిని కూడా ఎఫ్ఆర్ఎస్ పరిధిలోకి తీసుకురావటంతో పాటు వారి అటెండెన్స్ ప్రకారం జీతాలు చెల్లించేలా లింకు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
Read Also- Jagan on Balakrishna: ఎంతపెద్ద మాట సార్.. బాలకృష్ణపై జగన్ షాకింగ్ కామెంట్స్!.. కౌంటర్ ఇస్తాడా?
రాంకీ పనితీరుపై ఫోకస్
గ్రేటర్ పరిధిలో చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు నిర్ణీత సమయంలో చెత్త తరలింపు వంటి విధులతో పాటు వర్నెలబుల్ గ్యార్బేజీ పాయింట్ (వీజీపీ)ల వద్ద సకాలంలో చెత్తను తరలించే బాధ్యతలను నిర్వహిస్తున్న రాంకీ సంస్థ పనితీరుపై కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్పెషల్ ఫోకస్ చేసినట్లు సమాచారం. రాంకీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చెత్త సేకరణ, తరలింపునకు ఎంగేజ్ చేయాల్సిన వాహానాల సంఖ్యను కూడా పెంచాలని కమిషనర్ రాంకీకి సూచించారు. ఇప్పటి వరకు రాంకీకి చెల్లించాల్సిన బకాయిల్లో భాగంగా గురువారం రూ.100 కోట్లను చెల్లించినట్లు, ఇకపై రాంకీ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కడ ఎలాంటి లోపం జరిగినా భారీగా జరిమానాలు విధించాలని కమిషనర్ కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
