Jagan on Balakrishna: మరి నిజమో, అబద్ధమో తెలియదు గానీ ఒక సినీనటుడిగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అంటే ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) తెగ అభిమానమని చెబుతుంటారు. నిజమేనంటూ వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు కూడా ఇప్పటికే చాలాసార్లు, చాలా పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించి ఒక పాత పేపర్ కటింగ్‌ను కూడా షేర్ చేస్తుంటారు. నిజంగానే అభిమానం అడ్డొచ్చిందో, ఇంకేదైనా కారణం ఉందేమో గానీ బాలకృష్ణ ఎన్నిసార్లు విమర్శలు, ఆరోపణలు గుప్పించినా ఇన్నాళ్లు ఒక్క చిన్నమాట కూడా అనని వైఎస్ జగన్ గురువారం (అక్టోబర్ 23) ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా తనపై ఘాటుగా మాట్లాడిన బాలకృష్ణకు మీడియా సమావేశంలో ఎడాపెడా ఇచ్చిపడేశారు.
తాగినోడు.. మానసిక ఆరోగ్యం ఎలా ఉందో?
వైఎస్ జగన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ బాలయ్యపై నిర్మోహమాటంగా (Jagan on Balakrishna) విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ తనను అవమానించలేదని నేరుగా చిరంజీవి ప్రకటించారు కదా?, ఆ వ్యవహారంపై అభిప్రాయం ఏంటని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, బాలయ్య చిన్నబుచ్చుకునేలా జగన్ సమాధానం ఇచ్చారు. ‘‘ పనీపాటా లేని చర్చను బాలకృష్ణ అసెంబ్లీలోకి తీసుకొచ్చాడు. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏందీ!. ఆయన తాగి మాట్లాడింది ఏందీ!. అసలు తాగినోడిని అసెంబ్లీలో మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారంటే ముందు స్పీకర్‌కు బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే, అసెంబ్లీలో ఆ విధంగా నడుచుకున్నాడంటే, మానసిక ఆరోగ్యం ఎలా ఉందో ఆయనను ఆయనే ప్రశ్నించుకోవాలి’’ అని జగన్ చురకలు అంటించారు.
నిజానికి రాజకీయ ప్రత్యర్థులుగా, ముఖ్యంగా బాలయ్య విపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు విమర్శనాస్త్రాలు సంధించినా జగన్ ఎనాడు నేరుగా స్పందించిన దాఖలాలు లేవు. ఎప్పుడూ ఏమీ అనలేదు. మౌనమే వహిస్తూ వచ్చారు. సినీ నటుడిగా బాలయ్యపై జగన్‌కు అభిమానం ఉందనే చర్చ నేపథ్యంలో ఈ మౌనం ఆసక్తికరంగా అనిపిస్తుండేది. కానీ, గురువారం జగన్ చేసిన వ్యాఖ్యలు అభిమానం తెరను పక్కకు నెట్టేసినట్టయింది. కేవలం బాలకృష్ణ తీరునే కాకుండా, ఆయన మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్‌ను కూడా జగన్ ఘాటుగా విమర్శించారు.
బాలయ్య రియాక్షన్ ఉంటుందా?
సినీరంగానికి సంబంధించి గత ప్రభుత్వం హయాంలో నాడు సీఎంగా జగన్‌తో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖలు భేటీ అయ్యారు. ఆ సందర్భాన్ని గత నెలలో అసెంబ్లీలో ప్రస్తావిస్తూ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ పరుష పదజాలాన్ని వాడారు. అటు చిరంజీవి, ఇటు వైఎస్ జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే ఆ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యారు. అయినప్పటికీ, బాలయ్య గానీ, అటు టీడీపీ గానీ అధికారికంగా వివరణ ఇచ్చింది లేదు. అయితే, తాజాగా జగన్ చేసిన ‘తాగబోతు’ మాటల దాడిపై బాలయ్య స్పందిస్తారా?, లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్క బాలయ్యే కాకుండా, స్పీకర్‌కు కూడా బుద్ధిలేదనడంతో జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి!.
Read Also- Mehul Choksi: రూ.13 వేల కోట్లు దోచిన మెహుల్ ఛోక్సీకి.. జైల్లో రాజ భోగాలు.. సౌకర్యాలు తెలిస్తే షాకే!
