Mehul Choksi: బెల్జియంలో దాక్కున్న వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహూల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు ఆ దేశం అంగీకరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రూ.13,000 కోట్లు ఎగవేసి పరారైనట్లు చోక్సీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించాలని గతవారం బెల్జియం కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో భారత్ కు వచ్చిన వెంటనే అతడ్ని ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో నిర్భంధించనున్నారు. అయితే మెహూల్ చోక్సీకి కేటాయించే జైలు గది వివరాలను భారత అధికారులు బెల్జియం కోర్టుకు తెలియజేశారు. అయితే జైల్లో అతడికి కల్పించిన సౌకర్యాలు, అందుకు సంబంధించిన ఫొటోలు తీవ్ర చర్చకు దారితీశాయి.
బెల్జియంతో పంచుకున్న భారత్..
భారత ప్రాసిక్యూషన్ సమర్పించిన ఫొటోలను గమనిస్తే.. అతడికి కేటాయించే జైలు గది యూరోపియన్ స్టైల్లో తీర్చిదిద్దారు. భద్రత – సౌకర్యాలు రెండింటిని సమన్వయ పరిచేలా గదిని రూపుదిద్దారు. మెహూల్ చోక్సీకి జైలులోని బారక్ నెంబర్ 12లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన రెండు గదుల్లో ఒకటి కేటాయించనున్నట్లు భారత అధికారులు.. బెల్జియం కోర్టుకు తెలియజేశారు. అతడ్ని నిర్భంధించే సెల్ కు సంబంధించిన వివరాలను డాక్యుమెంట్స్ రూపంలో కోర్టుకు తెలియజేశారు.
టీవీ, అటాచ్డ్ బాత్రూమ్
భారత ప్రాసిక్యూషన్ సమర్పించిన డాక్యుమెంట్స్ ప్రకారం.. మెహూల్ చోక్సీకి విశాలమైన సెల్ తో పాటు గాలి, వెలుతురు పుష్కలంగా లభించనుంది. గదిలో మూడు కిటికీలతో పాటు పై భాగంలో వెంటిలేటర్ సౌకర్యం సైతం ఉంది. వీటితో పాటు చెమట పట్టకుండా మూడు సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉన్నాయి. అలాగే ఖైదీకి వినోదం, వార్తలు అందించేందుకు ఒక టెలివిజన్ ను సైతం ఏర్పాటు చేశారు. అలాగే సెల్ కు అనుబంధంగా ఒక అటాచ్డ్ బాత్రూమ్ సైతం ఉన్నట్లు డాక్యుమెంట్స్ లో పేర్కొన్నారు. ఖైదీకి ఇబ్బంది లేకుండా వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్ కబోర్డ్, బ్రష్ చేసుకోవడానికి సింక్, గదిలో 6 ట్యూబ్ లైట్స్ అమర్చారు.
Preparations to welcome fugitive Mehul Choksi at Mumbai’s Arthur Road Jail. Quite a journey from Belgium to India. pic.twitter.com/pJw3iDU2Ix
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 22, 2025
24 గంటల పహారా
మెహూల్ చోక్సీని బంధించే సెల్ వద్ద పోలీసు సిబ్బంది 24 గంటల పాటు విధుల్లో ఉండనున్నారు. ఇక జైలులోని విస్తారమైన కారిడార్, నడక దారి.. ఉదయం, సాయంత్రం వేళల్లో ఖైదీలు వాకింగ్ చేయడానికి సౌకర్యంగా ఉంటుందని డాక్యుమెంట్ లో భారత ప్రాసిక్యూషన్ తెలియజేసింది. అయితే జైల్లో ఈ ఏర్పాట్లను కేంద్రం ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. ప్రతీ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన జైలు ఉండాలని గతంలో కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. విదేశాలకు పారిపోయిన ఆర్ధిక నేరగాళ్లు, అంతర్జాకీయ క్రిమినల్స్, నేరం చేసిన ప్రముఖుల కోసం ఈ సెల్స్ ఏర్పాటు చేయడం గమనార్హం.
Also Read: IND vs AUS 1st Innings: రాణించిన హిట్ మ్యాన్.. ఆకట్టుకున్న అయ్యర్, అక్షర్.. ఆసీస్ లక్ష్యం ఎంతంటే?
అరెస్టుకు చట్టబద్ద గుర్తింపు
బెల్జియంలో మెహూల్ చోక్సీ అరెస్టును అక్కడి న్యాయస్థానం చట్టబద్దంగా గుర్తించింది. భారత్ ఇచ్చిన ఆధారాలతో అతడి అప్పగింత రాజకీయ దురుద్దేశంతో జరగడం లేదని నిర్ధారించింది. చోక్సీ సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న తిహార్ జైలు పరిస్థితులు.. తనకు కేటాయించబడనున్న ఆర్థర్ రోడ్ జైలు గదికి సంబంధించనివని కోర్టు పేర్కొంది. అదే సమయంలో 2021లో మే నెలలో భారత్ ఆదేశాల మేరకు ఆంటిగ్వాలో చోక్సీని కిడ్నాప్ చేశారన్న ఆరోపణకు సరైన ఆధారాలు లేవని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో అతి త్వరలోనే ఆర్థిక నేరగాడు మెహూల్ చోక్సీ భారత్ లో అడుగుపెట్టనున్నాడు.
