Gadwal Vijayalakshmi: ప్రపంచంలోనే అగ్రశ్రేణి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) వెల్లడించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రాంతం రాజరిక, నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది ప్రజా పాలన దిశగా నడుస్తుందన్నారు. అందువల్లే ఈ రోజు ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటుందని చెప్పారు.
Also Read: Viral News: సినిమా పిచ్చోళ్లు అంటే వీళ్లేనేమో.. టికెట్ల కోసం 7 ఏళ్ల బిడ్డను వదిలేశారు!
దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని వివరించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 50 వేలకు పైగా రేషన్ కార్డులను పేద కుటుంబాలకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటిహైదరాబాద్ మహానగర బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేందుకు, అవసరాలకు తగిన విధంగా అభివృద్ది చేసేందుకు, మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు.
మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ ప్రక్షాళన, హెచ్-సిటీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ ప్రపంచంలోనే మేటి నగరంగా మారనుందని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, అదనపు కమిషనర్ గీతా రాధిక, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ , చీఫ్ ఇంజనీర్ లు సహదేవ్ రత్నాకర్, నిత్యానంద్, విజిలెన్స్ ఏఎస్పీ సుదర్శన్, డీఎస్పీ నరసింహ రెడ్డి, ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read: Bhatti Vikramarka: రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుపై నివేదిక ఇవ్వండి: భట్టి విక్రమార్క