Hyderabad Metro Offers: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇటీవల పెంచిన మెట్రో రైలు ఛార్జీలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సవరించిన ధరలు.. మే 24 నుంచి అమల్లోకి వస్తాయని హైదరాబాద్ మెట్రో స్పష్టం చేసింది.
గత వారమే ఛార్జీలను పెంచుతూ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. కనిష్ట టికెట్ ధరను రూ.10 నుంచి రూ.12 కు పెంచింది. అలాగే గరిష్ట టికెట్ రేటును రూ.60 నుంచి రూ.75గా సవరించింది. అయితే తాజాగా తగ్గింపుతో 10 శాతం మేర టికెట్ ధరలు తగ్గనున్నాయి. గతంలో నిర్ణయించిన వాటి కంటే తక్కువే టికెట్ లభించనుంది. దీని ద్వారా మెట్రో ప్రయాణికులకు ఖర్చు తగ్గనుంది.
ఛార్జీల తగ్గింపుపై మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు సరసమైన ధరలకే ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. మెట్రో కార్యాకలాపాల నిమిత్తం ఇటీవల మెట్రో ఛార్జీలు పెంచామని స్పష్టం చేశారు. అయితే ప్రయాణికులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఛార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
Also Read: MLA Bhuma Akhilapriya: అధిష్టానంపై భూమా అఖిల ప్రియ ఫైర్.. పెద్ద మాటే అనేశారుగా!
కాగా ఇటీవల మెట్రో ఛార్జీల పెంపుపై ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. తమపై ఆర్థిక భారం బాగా పెరిగిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు విపక్షాలు సైతం మెట్రో ఛార్జీల పెంపును తప్పుబట్టాయి. ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశాయి. అటు ప్రభుత్వంపైనా ఛార్జీల పెంపు అంశం ప్రభావం చూపింది. దీంతో హైదరాబాద్ మెట్రో.. వెనక్కి తగ్గినట్లు సమాచారం.