Notices to KCR: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భారీ షాక్ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) అవకతవకలకు సంబంధించి.. ఆయనకు నోటీసులు వెళ్లాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (P.C Ghose Commission) ఈ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao), బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) కు సైతం నోటీసులు పంపింది. 15 రోజుల్లో కమిషన్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశాలిచ్చింది.
కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సీఎంగా ఉండగా.. హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికి తాజాగా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ ను జూన్ 5న విచారణకు రావాలని సూచించింది. అలాగే హరీశ్‌రావును జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
Also Read: Karimnagar Railway Station: స్వర్గం లాంటి రైల్వే స్టేషన్.. సౌఖర్యాలు చూస్తే మతి పోవాల్సిందే!
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ గత ప్రభుత్వ హయాంలో కుంగిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాజెక్ట్ కింద నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్.. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, నీటిపారుదల, పే అండ్ ఎకౌంట్స్, ఉన్నతాధికారులు, నిర్మాణసంస్థల ప్రతినిధులు.. ఇలా అందరినీ విచారించింది. ఈ క్రమంలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.