Karimnagar Railway Station: కరీంనగర్ రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. గత ఏడాది ఆగస్టులో ప్రధాని మోదీ (Prime Minister Modi) చేతుల మీదుగా వర్చువల్‌గా శంకుస్థాపన జరిగిన పునరుద్దరణ పనులు.. శరవేగంగా పూర్తయ్యాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కళ్లు చెదిరేలా అధికారులు నిర్మాణాలు చేపట్టారు. అమృత్ భారత్ స్కీం కింద అభివృద్ధి చేసిన ఈ రైల్వే స్టేషన్ ను.. ఈనెల 22న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రథమ శ్రేణి రైల్వే స్టేషన్లకు ధీటుగా తయారైన కరీంనగర్ స్టేషన్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెరుగైన సౌఖర్యాలు
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (Amrit Bharat Station Scheme) నిధులతో కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారిపోయాయి. పేరుకు రైల్వేస్టేషన్ అయినప్పటికీ ఏయిర్ పోర్టు రేంజ్‌లో అందంగా ముస్తాబైంది. లిఫ్టులు, ఎస్కలేటర్లలాంటి మెరుగైన సౌకర్యాలతో కరీంనగర్ రైల్వేస్టేషన్లు కొత్త రూపు సంతరించుకుంది. ఆకట్టుకునే ఎలివేషన్‌తో గ్రాండ్ లుక్‌ను సంతరించుకుంది. రైల్వే స్టేషన్ బయట, లోపల ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. స్టేషన్‌లోపల అడుగుపెడితే ప్రథమ శ్రేణి రైల్వేస్టేషన్‌లోకి అడుగుపెట్టిన ఫీలింగ్ కలగనుంది. పాత స్టేషన్‌తో ఏ మాత్రం పోలిక లేకుండా అధికారులు పూర్తి చేశారు.
షాపింగ్ కాంప్లెక్స్.. ఎల్ఈడీ స్క్రీన్స్
తీగలగుట్టపల్లి రోడ్‌లో ఉన్న ఎంట్రన్స్ లో స్వాగత తోరణాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. అక్కడ నుంచి స్టేషన్ వరకు రెండు వరసల రహదారి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసారు. ఇక స్టేషన్ మేయిన్ గేట్ చూస్తే.. గ్రాండ్‌లుక్‌తో అదిరిపోయేలా ఉంది. మోడరన్ టికెట్ కౌంటర్, సైన్ బోర్డులు.. ప్రయాణీకులు రెస్ట్ తీసుకునేందుకు లాంజ్‌లు.. ఫ్యాన్లు స్టేషన్ లో ఉన్నాయి. అలాగే అధునాతనమైన మరుగుదొడ్లు, షాపింగ్ కాంప్లెక్స్, ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.
కొత్తగా రెండు ఫ్లాట్‌ఫారాలు
కరీంనగర్ రైల్వే స్టేషన్ లో కల్పించిన సౌఖర్యాలు ఒక ఎత్తయితే ప్లాట్‌ఫామ్స్ డెవలప్ మెంట్ మరో ఎత్తు అని చెప్పవచ్చు. గతంలో ఒకటే ప్లాట్‌ఫారం ఉండేది. ఇప్పుడు మరో రెండు ప్లాట్‌ఫారాలను నిర్మిస్తున్నారు. అయితే ఆ ఫ్లాట్ ఫారాలు వెళ్లేందుకు ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జీ ఏర్పాటు చేసారు. ఇక ప్రయాణీకుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదీ గాక స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గ్రీనరీని పెంచి ఆహ్లదకరంగా తయారు చేసారు.
పునరుద్దరణ ఖర్చు ఎంతంటే?
అమృత్‌భారత్ స్కీం కింద రూ.26 కోట్ల రూపాయల నిధులతో కరీంనగర్ రైల్వే స్టేషన్ ను పునఃనిర్మించారు. నూతన స్టేషన్ కి సంబంధించి ఇంకా చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నా.. మేజర్ పనులన్నీ పూర్తయ్యాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రత్యేక చొరవ తీసుకుని రికార్డు సమయంలో పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించారు. పలుమార్లు పనుల జరగుతున్న తీరును ఆయన పరిశీలించారు. వేగంగా పనులు పూర్తయ్యేలా అధికారులను పురమాయించారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. మంత్రి కీలక ఆదేశాలు.. రంగంలోకి కమిటీ!
ప్రారంభించనున్న ప్రధాని
కరీంనగర్ రైల్వే స్టేషన్ పునరుద్దరణకు సంబంధించి ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 22న వర్చువల్ గా స్టేషన్ ను ప్రారంభించనున్నారు. దీంతో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కరీంనగర్ వాసుల కల నెరవేరబోతోందని చెప్పవచ్చు.